ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ సాధ్యం
నేను సైతం 2.0" కార్యక్రమంలో 54 సీసీటీవీ కెమెరాల ప్రారంభం – ఏసీపీ కృష్ణయ్య
ఎల్బీనగర్:
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, నేర పరిశోధనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు అత్యంత కీలకమని ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య పేర్కొన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చేపడుతున్న "నేను సైతం 2.0" కార్యక్రమంలో భాగంగా, నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం డబుల్ బెడ్‌రూమ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన 54 సీసీటీవీ కెమెరాలను సోమవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ, సీసీ టీవీ కెమెరాలు నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపు, నేరాల పరిశోధనలో కీలక ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి కాలనీ, అపార్ట్‌మెంట్, వాణిజ్య సంస్థలు సీసీటీవీ నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టి అన్నారం డబుల్ బెడ్‌రూమ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లోని నాలుగు బ్లాకుల నివాసితులు తమ సొంత వ్యయంతో 54 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని, పోలీసులకు ప్రజల సహకారం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నాగోల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ, ఎస్‌ఐ శివ నాగ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ దేవిడి వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ ఇన్‌చార్జ్‌లు రిజ్వాన్, భాస్కర్, దేవేందర్, మొహమ్మద్ ఖాతీజా బేగం తదితరులు పాల్గొన్నారు.
