మూసి పునరుజ్జీవనం: తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది!
అభివృద్ధి-మానవీయతల కలయికతో చారిత్రాత్మక ప్రాజెక్ట్... బాధితులకు తక్షణమే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్:
హైదరాబాద్ మహానగర రూపురేఖలను మార్చేలా, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి చారిత్రాత్మక పునాది కాబోతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో అభివృద్ధి, మానవీయ కోణాలను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన ప్రకటించారు.
సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో మూసి ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ, పునరావాస చర్యలపై మంత్రి ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
*బాధితులకు అండగా ప్రభుత్వం... అధికారులకు కీలక ఆదేశాలు
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులకు పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించినట్లుగా మూసి ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరుతో పేదల జీవితాలు దెబ్బతినకుండా ప్రతి నిర్ణయం మానవీయ కోణంలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
*న్యాయమైన పరిహారం: భూములు, ఆస్తులు కోల్పోయే వారికి చట్టబద్ధమైన పరిహారం, సరైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదు.
భూ సేకరణ ప్రక్రియలో అధికారులు నిరంకుశంగా వ్యవహరించకుండా, ప్రజా సంక్షేమమే పరమావధిగా మానవీయ దృక్పథంతో వ్యవహరించాలి.
*భాగస్వామ్య అధికారులు వీరే...
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేశ్ కుమార్, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ నిరోధక జనరల్ (ఐజీ) రాజీవ్ గాంధీ హనుమంతు, మూసి నది తీర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్ట్ (మూసి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్) నిర్వహణ సంచాలకులు (ఎండీ) ఈ.వి. నర్సింహారెడ్డి, హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కమిషనర్ సర్పరాజ్ అహ్మద్‌తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
*మూసి తీరంలో సరికొత్త నగర జీవనం!
దశాబ్దాలుగా మూసి నది కాలుష్యం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను, వరదల సమయంలో ఎదుర్కొంటున్న కష్టాలను శాశ్వతంగా తొలగించేందుకే ఈ బృహత్తర ప్రాజెక్టును తలపెట్టినట్లు మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వరద నియంత్రణ, నీటి శుద్ధీకరణ, పచ్చదనం పెంపుదలతో పాటు రోడ్లు, ఉద్యానవనాలు (పార్కులు), నడకదారులు (వాక్‌వేలు), వినోద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తద్వారా మూసి పరివాహక ప్రాంతాలను పర్యాటక, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ప్రధాన కేంద్రాలుగా మార్చి, భవిష్యత్ తరాలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవన వాతావరణాన్ని అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా ఇచ్చారు..jpeg)
