*అభివృద్ధిని అడ్డుకునేందుకే తప్పుడు ఆరోపణలు

*కిషన్‌రెడ్డిపై నిప్పులు చెరిగిన రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి

*అభివృద్ధిని అడ్డుకునేందుకే తప్పుడు ఆరోపణలు

*హైదరాబాద్:

నియోజకవర్గంలో జరుగుతున్న ప్రగతి ప్రస్థానం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కిషన్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత ఒత్తిళ్లకు లొంగి, మునగనూరుకు వచ్చి నాటకాలాడుతున్నారని మండిపడ్డారు.

*2023లో అధికారంలో ఉన్నదెవరు?
మునగనూరు సర్వే నంబర్ 44లో భూములు కబ్జాకు గురయ్యాయంటూ కిషన్‌రెడ్డి చేస్తున్న విమర్శలపై రాంరెడ్డి ఘాటుగా స్పందించారు. సదరు భూముల రిజిస్ట్రేషన్ 2023లో జరిగిందని గుర్తు చేసిన ఆయన, "అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు?" అని ప్రశ్నించారు. కబ్జాల చరిత్ర అంతా కిషన్‌రెడ్డిదేనని, ఆ భూముల వ్యవహారంపై ప్రస్తుత శాసనసభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డి గతంలోనే అసెంబ్లీలో గళమెత్తారని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు అక్కడ ప్రభుత్వ బోర్డులను నాటించిన ఘనత మల్‌రెడ్డి రంగారెడ్డిదేనని వివరించారు.

*14 ఏళ్లుగా భూములను కాపాడుకుంటూ వస్తున్నాం
"మా దృష్టంతా నియోజకవర్గ ప్రగతిపైనే ఉంది తప్ప, కిషన్‌రెడ్డి లాగా భూముల దోపిడీపై కాదు" అని రాంరెడ్డి వ్యాఖ్యానించారు. ఫార్మాసిటీ భూముల పరిహారం వివాదం, ఇబ్రహీంపట్నం బస్సు డిపో పక్కన కబ్జాలు, మునగనూరు, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసరాల్లో జరిగిన భూదోపిడీల వెనుక కిషన్‌రెడ్డి హస్తం ఉందన్నారు. గత 14 ఏళ్లుగా కిషన్‌రెడ్డి అక్రమాల నుంచి ఇక్కడి విలువైన భూములను కాపాడుతూ వస్తున్నామని చెప్పారు. తాము ఎల్లప్పుడూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరతామే తప్ప, కబ్జాలకు పాల్పడబోమని స్పష్టం చేశారు.

*తహసీల్దార్‌పై దాడికి ఆ తీరే కారణం
గతంలో అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌పై జరిగిన పెట్రోల్ దాడి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, కిషన్‌రెడ్డి అనుసరించిన భూకబ్జాల తీరే ఆ దురదృష్టకర సంఘటనకు దారితీసిందని రాంరెడ్డి ఆరోపించారు. బాధ్యతాయుతమైన పరిపాలనను వదిలేసి, వ్యసనాలపై దృష్టి పెట్టే వ్యక్తుల నుంచి తాము నీతులు నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.

*ప్రగతి పథంలో ఇబ్రహీంపట్నం
గతంలో వైఎస్సార్ హయాంలోనే మలక్‌పేట్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత మల్‌రెడ్డి రంగారెడ్డికి దక్కుతుందని రాంరెడ్డి గుర్తు చేశారు. అదే బాటలో ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధిక నిధులు సాధించిన నియోజకవర్గాలలో ఇబ్రహీంపట్నం నాల్గో స్థానంలో నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కిషన్‌రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని, లేనిపోని ఆరోపణలు చేస్తే ఇకపై సహించేది లేదని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.WhatsApp Image 2026-07-09 at 19.06.28 (1)

About The Author