మహిళా శక్తితోనే వికసిత భారతం!

  • *ఏపీఎంఏఎస్ రజతోత్సవ సదస్సులో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపు
  • *దేశంలో రూ.3.04 లక్షల కోట్ల బ్యాంకింగ్ లింకేజీతో దూసుకెళ్తున్న 1.43 కోట్ల స్వయం సహాయక సంఘాలు
  • *'తెలంగాణ రైజింగ్-2047' లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలి.

మహిళా శక్తితోనే వికసిత భారతం!

హైదరాబాద్:

మహిళా సాధికారతే దేశ సమగ్ర అభివృద్ధికి అత్యంత బలమైన పునాది అని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్ ఎం.సి.ఆర్. హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో బుధవారం ఘనంగా ప్రారంభమైన 'ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ది నిధి' (APMAS) రజతోత్సవ వేడుకలు, "సమ్మిళిత వృద్ధికి సామాజిక మార్గాలు" అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

*సామాజిక మార్పునకు ప్రతీక: ఏపీఎంఏఎస్
గడిచిన 25 ఏళ్లుగా ఏపీఎంఏఎస్ సాగించిన ప్రయాణం కేవలం ఒక సంస్థ విజయగాథ మాత్రమే కాదని, అది గ్రామీణ సమాజంలో నమ్మకం, సేవాభావం, నవకల్పనలను నింపిన ఒక అద్భుత సామాజిక విప్లవమని గవర్నర్ కొనియాడారు. మహిళలు, చిన్న, సన్నకారు రైతులను ఆర్థికంగా నిలబెడుతూ ఈ సంస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక అభివృద్ధి ఉద్యమాల్లో ఒకటిగా నిలిచిన స్వయం సహాయక సంఘాల (SHGs) బలోపేతంలో దీని పాత్ర అనన్యసామాన్యమైనదన్నారు.

దేశవ్యాప్తంగా మహిళా చైతన్యం (మార్చి 31, 2025 నాటికి):
అనుసంధానమైన గ్రామీణ కుటుంబాలు: 17 కోట్లకు పైగా
*క్రియాశీలక సంఘాలు: 1.43 కోట్లు
*బ్యాంకింగ్ రుణాలు: రూ. 3.04 లక్షల కోట్లకు పైగా

ఇది కేవలం ఆర్థిక సమ్మిళితం మాత్రమే కాదని, గ్రామీణ పారిశ్రామికతకు, మహిళా నాయకత్వానికి దక్కిన విజయమని గవర్నర్ అభివర్ణించారు.

*తెలంగాణ ప్రగతిలో 'స్త్రీనిధి' మైలురాయి
తెలంగాణలో మహిళా సంఘాల బలోపేతానికి ఏపీఎంఏఎస్ అందించిన సహకారాన్ని గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో 6 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు, 23 వేల సమాఖ్యల పరిధిలోని 67 లక్షల మంది మహిళలను ఈ సంస్థ సాధికారత వైపు నడిపించిందన్నారు. ముఖ్యంగా 'స్త్రీనిధి' వంటి కమ్యూనిటీ ఆర్థిక సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందని, మార్చి 31, 2026 నాటికి స్త్రీనిధి ద్వారా 32 లక్షల మంది సభ్యులకు రూ. 25 వేల కోట్లకు పైగా రుణాలు అందించడం ఒక రికార్డు అని పేర్కొన్నారు. ప్రస్తుతం 86 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPOs) బలోపేతం చేస్తూ, 40 వేల మంది చిన్న రైతుల జీవితాల్లో సానుకూల మార్పు తెస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

*'తెలంగాణ రైజింగ్–2047' లక్ష్యాలు:
'తెలంగాణ రైజింగ్-2047' రోడ్‌మ్యాప్ కింద రాష్ట్రం నిర్దేశించుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం, సామాజిక సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
సహజ వ్యవసాయం, నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

 *వాతావరణ అనుకూల సాంకేతికతలు, వాల్యూ యాడెడ్ (విలువ ఆధారిత) ఉత్పత్తులను ప్రోత్సహించాలి.

 * ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన "సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్" స్ఫూర్తితో ప్రతి బడుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందాలని ఆకాంక్షించారు.

*కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
ఈ సదస్సులో పాల్గొన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మౌలిక వసతులు, నెట్‌వర్క్ వ్యవస్థలు ఎంతగానో మెరుగయ్యాయని, ఈ డిజిటల్ యుగంలో సరికొత్త వ్యూహాలతో సమ్మిళిత అభివృద్ధికి సంస్థలు కృషి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ఈ ప్రయాణంలో ఏపీఎంఏఎస్ తన వంతు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అందించాలని కోరారు.

*పబ్లికేషన్ ఆవిష్కరణ.. 'ఏక్ పేడ్ మా కే నామ్' పిలుపు
ఈ సందర్భంగా 25 ఏళ్ల ప్రయాణ జ్ఞాపకాలతో రూపొందించిన "మెనీ వాయిసెస్ - 25 ఇయర్స్ ఆఫ్ వాకింగ్ టుగెదర్" అనే ప్రత్యేక పబ్లికేషన్‌ను గవర్నర్ ఆవిష్కరించారు. అలాగే, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రధాని పిలుపునిచ్చిన "ఏక్ పేడ్ మా కే నామ్" (అమ్మ పేరిట ఒక మొక్క) కార్యక్రమంలో ప్రతి మహిళా సంఘం చురుగ్గా పాల్గొని, మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చైతన్యం తీసుకురావాలని గవర్నర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎంఏఎస్ చైర్‌పర్సన్ కాకి మాధవరావు, కో-ఫౌండర్ ఎస్.పి. టక్కర్, సీఈఓ సి.ఎస్. రెడ్డి, సంస్థ ప్రతినిధులు మరియు ప్రముఖులు పాల్గొన్నారు.

About The Author