ఎమ్మెల్యే రాజాసింగ్‌కు క్లీన్ చిట్: వీగిపోయిన వివాదాస్పద వ్యాఖ్యల కేసు!

  • ప్రజల సెంటిమెంట్ల ఆధారంగా శిక్షలు వేయలేం: ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు
  • సాక్షుల నోట 'గ్రంథాల' నిజాలు.. ఐఓ నిర్లక్ష్యం, ఫోరెన్సిక్ సాక్ష్యాల ట్యాంపరింగ్‌తో ఘోరంగా విఫలమైన ప్రాసిక్యూషన్.

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు క్లీన్ చిట్: వీగిపోయిన వివాదాస్పద వ్యాఖ్యల కేసు!

హైదరాబాద్:

రాష్ట్ర రాజకీయాల్లోనూ, దేశవ్యాప్తంగానూ తీవ్ర సంచలనం సృష్టించిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గోషామహల్ శాసనసభ్యుడు టి. రాజాసింగ్‌కు పెద్ద ఉపశమనం లభించింది. ఆయనపై మోపిన అన్ని చార్జీలను కొట్టివేస్తూ హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మంగళహాట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ "261/2022 (సీసీ నంబర్ 472/2023)" కేసు విచారణలో ప్రాసిక్యూషన్ మోపిన ఆరోపణల్లో ఏ ఒక్కదానిని కూడా సహేతుకమైన ఆధారాలతో నిరూపించలేకపోవడంతో న్యాయస్థానం రాజాసింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ విముక్తి కల్పించింది.
గతంలో ఐపీసీ సెక్షన్లు 153A(a)(b), 295A, 504, 505(2), మరియు 506 కింద వివిధ మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారనే తీవ్రమైన అభియోగాలతో పోలీసులు ఈ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

*చట్టాన్ని కాదని.. 'పీడీ యాక్ట్' దాకా వెళ్లిన నాటకీయ పరిణామాలు
ఈ కేసు తొలినుంచీ తీవ్ర రాజకీయ ఉత్కంఠ రేపింది. కేసు నమోదైన వెంటనే రంగంలోకి దిగిన మంగళహాట్ పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, చట్టపరమైన నిబంధనలు పాటించలేదన్న కారణంతో నాటి న్యాయమూర్తి పోలీసు రిమాండ్‌ను తిరస్కరించారు. అయితే, దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అప్పటి ప్రభుత్వం, తక్షణమే స్పందిస్తూ రాజాసింగ్‌పై ముందస్తు నిర్బంధ చట్టం (పీడీ యాక్ట్) ప్రయోగించి జైలుకు తరలించింది. ప్రభుత్వ పెద్దల జోక్యంతో సాగిన ఈ పరిణామాలు అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజకీయ, సామాజిక చర్చకు దారితీశాయి.

*ప్రాసిక్యూషన్ సాక్షులే తిరగబడ్డారు: కోర్టులో వెల్లడైన నిజాలు
న్యాయస్థానంలో జరిగిన పూర్తిస్థాయి విచారణలో ప్రాసిక్యూషన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్వయంగా ప్రాసిక్యూషన్ నిలబెట్టిన ముఖ్య సాక్షులే క్రాస్ ఎగ్జామినేషన్‌లో నిజాలను ఒప్పుకోవడంతో కేసు పునాదులు కదిలిపోయాయి.

 *మొదటి సాక్షి (PW-1) వాంగ్మూలం: నిందితుడు ప్రస్తావించిన అంశాలు ఇస్లామిక్ గ్రంథమైన 'సహీహ్ అల్-బుఖారీ'లో ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు.

 *రెండవ సాక్షి (PW-2) తోపాటు పవిత్ర ఖురాన్ ప్రస్తావన:
 పవిత్ర ఖురాన్‌లోని 'సూరా అల్-అహ్జాబ్ (33:37)' లో ఉన్న అంశాల ఆధారంగానే సదరు వ్యాఖ్యలు ఉన్నాయనే విషయాన్ని సాక్షులు కోర్టు సమక్షంలో ఒప్పుకున్నారు.
దీంతో నిందితుడు సొంతంగా కల్పించి ఏ వ్యాఖ్యలు చేయలేదనే వాదనకు బలం చేకూరింది.

*దర్యాప్తు అధికారి ఘోర వైఫల్యం.. చార్జ్‌షీట్ అంతా తొందరపాటే!
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కనీస ముందస్తు దర్యాప్తు కూడా చేయలేదని దర్యాప్తు అధికారి (ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్) కోర్టు బోనులో ఒప్పుకోవడం గమనార్హం. నిందితుడు చేసిన వ్యాఖ్యలు ప్రామాణికమైన, గుర్తింపు పొందిన ఇస్లామిక్ మత గ్రంథాల ఆధారంగా చేసినవా? కాదా? అనే ప్రాథమిక నిజాన్ని తాను చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి ముందు ఎప్పుడూ సరిచూసుకోలేదని ఐఓ అంగీకరించారు. కేవలం రాజకీయ లేదా పైస్థాయి ఒత్తిళ్ల వల్లే చట్టపరమైన నిబంధనలను పక్కనబెట్టి ఆరోపణలు మోపినట్లు దీని ద్వారా స్పష్టమైంది.

*కత్తిరింపుల వీడియోలు.. డిజిటల్ సాక్ష్యాల ట్యాంపరింగ్!
సాంకేతిక ఆధారాలను (ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్) నిరూపించడంలోనూ ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైంది. నిందితుడికి వ్యతిరేకంగా పోలీసులు సమర్పించిన వివాదాస్పద వీడియో ఒరిజినల్ కాదని, అందులో మధ్యమధ్యలో కత్తిరింపులు, అంతరాయాలు (*Discontinuities) ఉన్నాయని ప్రాసిక్యూషన్ తరఫున హాజరైన ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుడే (FSL Expert) స్వయంగా ధృవీకరించారు. అంతేకాకుండా, డిజిటల్ సాక్ష్యాలను సేకరించినప్పటి నుండి కోర్టుకు సమర్పించే వరకు అనుసరించాల్సిన చట్టబద్ధమైన భద్రతా నిబంధనల (Chain of Custody*) విషయంలో పోలీసులు తీవ్ర లోపాలకు పాల్పడ్డారని న్యాయస్థానం తప్పుబట్టింది.

*ప్రజల సెంటిమెంట్ల ఆధారంగా శిక్షలు వేయలేం: కోర్టు కీలక వ్యాఖ్యలు
కోర్టు ముందుంచిన మౌఖిక మరియు పత్రాల ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన ప్రత్యేక న్యాయస్థానం.. నిందితుడిపై మోపిన ఏ ఒక్క నేరారోపణను కూడా సహేతుకమైన సందేహానికి తావులేకుండా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని స్పష్టం చేస్తూ తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది.

 "నేర నిరూపణలు అనేవి కేవలం ఊహాగానాలు, గుడ్డి ఆరోపణలు లేదా ప్రజల సెంటిమెంట్లపై ఆధారపడి జరగవు. ప్రాసిక్యూషన్ చట్టబద్ధంగా, నమ్మదగిన సాక్ష్యాలతో నేరాన్ని నిరూపించాల్సి ఉంటుంది. అలా చేయనప్పుడు చట్టం ప్రకారం నిందితుడిని నిర్దోషిగా విడుదల చేయాల్సిందే."

*ఇది రాజకీయ కక్షసాధింపుపై లభించిన విజయం: డిఫెన్స్ లాయర్
తీర్పు అనంతరం రాజాసింగ్ తరఫు ప్రముఖ న్యాయవాది *కె. కరుణా సాగర్* విలేకరులతో మాట్లాడుతూ.. "రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అప్పటి ప్రభుత్వం రాజాసింగ్‌పై ఈ తప్పుడు కేసు పెట్టింది. చట్టాన్ని, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టారు. కానీ, తుదికి న్యాయమే గెలిచింది. న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు చట్టసభల ప్రతినిధులకే కాకుండా, పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు దక్కిన విజయం" అని హర్షం వ్యక్తం చేశారు.

About The Author