ఐటీ హబ్‌లో ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ విప్లవం!
- *హైదరాబాద్ అభివృద్ధికి అనలాగ్ - మెగా చేతులు.!
- *సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన చారిత్రాత్మక అవగాహన ఒప్పందం
- *ట్రాఫిక్ సిగ్నళ్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అనుసంధానించాలని సీఎం కీలక సూచన
హైదరాబాద్:
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. భవిష్యత్ తరాలకు అవసరమైన మేధోపరమైన మౌలిక సదుపాయాల కల్పన, భౌతిక మేధో (ఫిజికల్ ఇంటెలిజెన్స్) ఆధారిత సాంకేతిక పరిష్కారాల కోసం అనలాగ్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థలు చేతులు కలిపాయి. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం) లోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అనలాగ్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి అలెక్స్ కిప్‌మాన్, మెగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. కృష్ణారెడ్డి సమావేశమయ్యారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె. రామకృష్ణారావు, ఇన్వెస్ట్ సీఈఓ, హైదరాబాద్ మెట్రోరైల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనలాగ్, మెగా సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో చేపట్టబోయే ప్రాజెక్టుల పురోగతిపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.
*‘కాగ్నిటివ్ సిటీ’గా భాగ్యనగరం!
అనలాగ్, మెగా సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో నగరంలో అత్యాధునిక భౌతిక మేధో వేదికలను (అడ్వాన్స్‌డ్ ఫిజికల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్స్) ప్రవేశపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతినిధులు సీఎంకు వివరించారు. సెన్సర్లు, రోబోటిక్స్ వంటి సాంకేతికతను ఉపయోగించి మరింత సురక్షితమైన, వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థను ఎలా నిర్మించవచ్చో పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించారు.
నగరంలో ఎదురయ్యే ప్రధాన సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకు ఈ సాంకేతికత కీలకం కానుంది.
*లీకేజీల గుర్తింపు: నీటి పైప్‌లైన్ లీకేజీలను ముందే గుర్తించి తక్షణ మరమ్మతులు చేపట్టడం.
*పవర్ మేనేజ్‌మెంట్: అవసరానికి అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించడం.
*గ్రీన్ చానల్: అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు ట్రాఫిక్ ఫ్రీ మార్గం సుగమం చేయడం.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం రూపొందించిన పైలట్ ప్రాజెక్ట్ వివరాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. వేగంగా పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా డేటా ఆధారిత మౌలిక సదుపాయాల ప్రణాళికను రూపొందించడానికి, ప్రభుత్వాల కార్యనిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి ఈ సరికొత్త సాంకేతికత ఎంతో దోహదపడుతుందని ఇరు సంస్థల ప్రతినిధులు స్పష్టం చేశారు.
*సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
ఈ ప్రతిపాదనలపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరు సంస్థల ప్రతినిధులకు పలు కీలక సూచనలు చేశారు.
"హైదరాబాద్ నగరంలోని అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఒకే గొడుగు కిందికి తెస్తూ ఇంటిగ్రేట్ చేయాలి. కేవలం సమయం ఆధారంగా కాకుండా, వాహనాల రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే ఆటోమేటిక్ విధానాన్ని తీసుకురావాలి. ముఖ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, వర్షాల వంటి అత్యవసర సమయాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేలా ఈ వ్యవస్థను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) కు అనుసంధానించాలి." - *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
>
*చారిత్రాత్మక అవగాహన ఒప్పందం
సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో అనలాగ్ - మెగా (ఎంఈఐఎల్) సంస్థల మధ్య అధికారిక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. పరస్పర సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి, ఆవిష్కరణల ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గనుక పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోనే అత్యంత ఆధునిక సాంకేతికతను వాడుతున్న నగరంగా హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించనుంది.
