ప్రత్యేక బలగాలు.. రాష్ట్ర భద్రతా కవచం!

  • డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపాలి: డీజీపీ సి.వి. ఆనంద్
  • *బెటాలియన్ల ఆధునికీకరణ, సిబ్బంది సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం
  • 'మిత్ర' కేంద్రాల ద్వారా మానసిక ఒత్తిడి దూరం.. విధుల్లో పూర్తి పారదర్శకత

ప్రత్యేక బలగాలు.. రాష్ట్ర భద్రతా కవచం!

హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిర్వహణ, విపత్తుల నిర్వహణ, అతి ముఖ్య వ్యక్తుల (వీఐపీ) బందోబస్తు, ప్రత్యేక ఆపరేషన్లలో కీలక భూమిక పోషిస్తున్న స్పెషల్ బెటాలియన్లు రాష్ట్ర భద్రతకు బలమైన కవచం లాంటివని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ బలగాలను మరింత ఆధునికంగా, సాంకేతికంగా బలోపేతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ స్పెషల్ బెటాలియన్ల ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ముందుగా ప్రధాన కార్యాలయంలోని వివిధ పరిపాలనా విభాగాలు, సమాచార వ్యవస్థ, ఆయుధాల నిర్వహణ, సాంకేతిక విభాగాలు, నిర్మాణ పనులు, మౌలిక వసతులను డీజీపీ స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులు సమర్పించిన నివేదికలపై (ప్రజెంటేషన్) సమీక్ష జరిపి, పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయడం, వాహనాల సంఖ్యను పెంచడం, సిబ్బందికి మెరుగైన నివాస వసతులు, తాగునీరు, వైద్య సౌకర్యాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.WhatsApp Image 2026-06-30 at 18.51.15 (1)

*నక్సల్స్ నిర్మూలనలో వీరోచిత పాత్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో అప్పటి ప్రత్యేక పోలీస్ (ఏపీఎస్పీ) బలగాలు శాంతిభద్రతల రక్షణలో వెన్నుదన్నుగా నిలిచాయని డీజీపీ గుర్తుచేశారు. "నేను నిజామాబాద్, వరంగల్ జిల్లాల పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ)గా పనిచేసిన కాలంలో పోలీస్ స్టేషన్లపై నక్సల్స్ దాడులు జరిగేవి. ఆ క్లిష్ట పరిస్థితుల్లో స్పెషల్ పోలీస్ బలగాలు అత్యంత ధైర్యసాహసాలతో విధులు నిర్వహించి నక్సల్స్ నిర్మూలనలో కీలక పాత్ర పోషించాయి" అని ప్రశంసించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం 13 స్పెషల్ బెటాలియన్లను ఏర్పాటు చేసిందని, ఇటీవల నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సంభవించిన భారీ వరదల సమయంలో ఈ సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడటం అభినందనీయమన్నారు.

*డ్యూటీల కేటాయింపులో వివక్ష వద్దు
పరిపాలనలో క్రమశిక్షణతో పాటు మానవతా దృక్పథం అవసరమని, విధులను కేటాయించే విధానంలో పూర్తి పారదర్శకత పాటించాలని డీజీపీ స్పష్టం చేశారు. ఎలాంటి వివక్ష లేకుండా, నిష్పాక్షికంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. గతంలో 18 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉండేవని, ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా సమసిపోయిందని తెలిపారు. భవిష్యత్తు అవసరాలను, విస్తరిస్తున్న నగరాలను దృష్టిలో ఉంచుకుని 'ఫ్యూచర్ సిటీ', ఆమనగల్ ప్రాంతాల్లో కొత్త స్పెషల్ బెటాలియన్ల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

*వ్యసనాలకు దూరం.. 'మిత్ర'తో మానసిక బలం
 *కమాండెంట్లకు డీజీపీ కీలక సూచనలు:
* నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉండే సిబ్బందికి మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. అధికారులే వారికి కొండంత అండగా నిలవాలి.

 * డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి సామాజిక వ్యసనాల బారిన సిబ్బంది పడకుండా నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలి.

 * వ్యసనాలకు లోనైన వారిని శిక్షించడం కంటే ముందు, వారిని గుర్తించి కౌన్సెలింగ్, వైద్య సహాయం ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకురావాలి.

పోలీసు సిబ్బందిలో మానసిక ఆరోగ్య పరిరక్షణకు, ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డీజీపీ ఆదేశించారు. ఇందుకోసం 'మిత్ర' కౌన్సెలింగ్ కేంద్రాలను మరింత సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. సిబ్బంది ప్రవర్తనలో వచ్చే మార్పులను సహచరులు, అధికారులు ముందుగానే గుర్తించి స్పందించాలన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ఆయుధాల వినియోగం, విపత్తు నిర్వహణ, శారీరక-మానసిక దృఢత్వంపై సిబ్బందికి నిరంతర శిక్షణ అందించాలని స్పష్టం చేశారు. ఆధునికీకరణ, క్రమశిక్షణ, సాంకేతికత, సిబ్బంది సంక్షేమం అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో బెటాలియన్లు ముందుకు సాగాలని డీజీపీ సి.వి. ఆనంద్ దిశానిర్దేశం చేశారు.WhatsApp Image 2026-06-30 at 18.51.15

About The Author