మానవతా మూర్తి పెద్ది శంకర్ సేవలు అభినందనీయం: త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి.
ఎల్బీనగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో కదిలీఫల అలంకరణ.. రెడీ టూ సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్‌కు జీయర్ స్వామి ఆర్థిక సాయం
హైదరాబాద్:
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో మంగళవారం ఆధ్యాత్మిక చైతన్యం, మానవతా దృక్పథం మేళవించిన అరుదైన ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. సరస్వతి నగర్ కాలనీలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజలు, అలాగే ప్రముఖ సామాజిక కార్యకర్త పెద్ది శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమంలో జరిగిన సేవా కార్యక్రమాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి పాల్గొని భక్తులకు, నిర్వాహకులకు దిశా నిర్దేశం చేశారు.
*పెద్ది శంకర్ సేవా నిరతికి జీయర్ స్వామి అభినందనలు
ఆలయ కార్యక్రమం అనంతరం, జీయర్ స్వామి ‘రెడీ టూ సర్వ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో పెద్ది శంకర్ నిర్వహిస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పెద్ది శంకర్ స్వామివారికి ఘన స్వాగతం పలికారు. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులను ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న స్వామివారు.. వృద్ధులకు అండగా నిలుస్తున్న పెద్ది శంకర్ సేవా భావాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆశ్రమ నిర్వహణ కోసం తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేసి ఉదారత చాటుకున్నారు.
*త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి
నెరవేరనున్న సొంత స్థలం కల: పెద్ది శంకర్ ధీమా
ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పెద్ది శంకర్ మాట్లాడుతూ.. జీయర్ స్వామివారి పావన చరణాల స్పర్శతో తమ ఆశ్రమం పావనమైందని ఆనందం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులతో ఓల్డ్ ఏజ్ హోమ్‌కు సొంత స్థలాన్ని సమకూర్చుకోవాలనే తమ చిరకాల వాంఛ త్వరలోనే సాకారం కానుందనే గట్టి నమ్మకాన్ని ఆయన వ్యక్తపరిచారు.
అంతకుముందు, సరస్వతి నగర్ కాలనీలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో కదిలీఫల (అరటిపండ్ల) అలంకరణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు విచ్చేసిన అహోబిల రామానుజ జీయర్ స్వామి.. హనుమంతునికి అలంకరించిన ఫలాలను భక్తులకు ప్రసాదంగా అందజేశారు. అనంతరం జరిగిన సత్సంగంలో ఆయన ‘హనుమద్వైభవం’పై అనుగ్రహ భాషణం చేశారు.
ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకులు జీడికంటి ప్రద్యుమ్నాచార్యులు, అర్చకులు అనిరుద్ ఆచార్య, నీరజ్ పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు విడియాల కేశవులు, ధర్మారావు, మురళి గౌడ్, విజయ్ భాస్కర్, శేఖర్ రెడ్డి సహా కాలనీవాసులు పాల్గొన్నారు.
ఈ మొత్తం సేవా కార్యక్రమంలో ప్రథ్యం శర్మ, అనిరుద్, శ్రీధర్ శర్మ, నాగ మోహన్ శర్మ, సుభాషిని, శ్రీ పాత్, నాగరాజు గౌడ్, శ్రీ విజయ గౌడ్, రేణుక ప్రకాష్, నవీన్, బాలకృష్ణ, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొని ఆశ్రమవాసులకు సేవలు అందించారు. జీయర్ స్వామి పర్యటనతో అటు భక్తులలో ఆధ్యాత్మిక ఆనందం, ఇటు పెద్ది శంకర్ బృందంలో సేవా ఉత్సాహం రెట్టింపయ్యాయి.

