హయత్‌నగర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శ్రీమతి పి.ఇందిర పదవీ విరమణ అభినందన సభ..

- హాజరైన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, 
- కార్పోరేషన్ ఛైర్మన్స్ మల్‌రెడ్డి రాంరెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్.

హయత్‌నగర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శ్రీమతి పి.ఇందిర  పదవీ విరమణ అభినందన సభ..

ఎల్బీనగర్:

హయత్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుదీర్ఘకాలం విద్యా సేవలందించి పదవీ విరమణ పొందిన శ్రీమతి పుచ్చకాయల ఇందిర పదవీ విరమణ అభినందన సభ మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఇ. నవీన్ నికోలస్ ఐఏఎస్ ముఖ్య అతిథులుగా హాజరై శ్రీమతి ఇందిరని ఘనంగా సన్మానించి, విద్యా రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలను కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆమె చేసిన కృషి ఆదర్శప్రాయమని పేర్కొంటూ, పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేయడాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకుని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో ముందుకు సాగుతున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి ఇటీవల ప్రారంభించారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అత్యాధునిక మౌలిక వసతులు, డిజిటల్ తరగతి గదులు, సాంకేతిక పరిజ్ఞానం, క్రీడా సదుపాయాలు, విద్యార్థుల సమగ్ర వికాసానికి అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలోని 100 నియోజకవర్గాల్లో అత్యాధునిక వసతులతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్” ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పాఠశాలలు భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి విద్యను అందించే కేంద్రాలుగా నిలుస్తాయని, తొలి విడత పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రెండో విడతలో మరిన్ని పాఠశాలలను ప్రారంభించి ప్రభుత్వ విద్యను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉపాధ్యాయులే సమాజ నిర్మాణ శిల్పులని, వారి కృషి వల్లే ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని కొనియాడారు. సుదీర్ఘకాలం అంకితభావంతో విద్యా సేవలందించిన శ్రీమతి పుచ్చకాయల ఇందిర సేవలు ఆదర్శప్రాయమని పేర్కొంటూ, పదవీ విరమణ అనంతరం కూడా తమ అనుభవంతో సమాజానికి మార్గదర్శకత్వం అందించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో చదివి రాష్ట్రానికి, దేశానికి మంచి పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ సుశీంద్ర రావు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వేంకటేశ్వర్లు, గోవర్ధన్ రెడ్డి, ఇంచార్జ్ హెడ్‌ మిస్ట్రెస్ రమాదేవి కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి హయత్‌నగర్ డివిజన్ అధ్యక్షులు చెన్నగోని రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెగావత్ గణేష్ నాయక్, నక్క శ్రీనివాస్, మతిన్ షరీఫ్, సోలిపురం వెంకట్రామ్ రెడ్డి, కొండోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొని శ్రీమతి ఇందిరకి శుభాకాంక్షలు తెలియజేశారు.WhatsApp Image 2026-06-30 at 19.18.33

About The Author