ఐడీహెచ్ కాలనీలో పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు
అభివృద్ధి పనులపై అధికారులకు కమిషనర్ ఆదేశం
హైదరాబాద్:
ఐడీహెచ్ డబుల్ బెడ్‌రూం ఇళ్ల కాలనీలో చిన్నారుల కోసం ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పార్కులను అభివృద్ధి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మంగళవారం సనత్‌నగర్ నియోజకవర్గం బన్సీలాల్‌పేట్ డివిజన్‌లోని ఐడీహెచ్, అంబేద్కర్ నగర్ కాలనీలలో ఆయన క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. కలెక్టర్ దాసరి హరిచందన, హౌసింగ్ ఎండీ గౌతమ్ ఆయన వెంట ఉన్నారు.
పాత సామగ్రి తొలగింపు.. పరిశుభ్రతే లక్ష్యం:
ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న పోషకాహారం నాణ్యతపై ఆరా తీశారు. అంగన్‌వాడీ ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న పాత వస్తువులను వెంటనే తొలగించి, ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చాలని సూచించారు. గాంధీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో తనిఖీ నిర్వహించిన ఆయన, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని, ఆసుపత్రి ప్రాంగణాన్ని నిత్యం శుభ్రంగా ఉంచాలని మెడికల్ అధికారిని ఆదేశించారు.
కాలనీల్లోని ఖాళీ స్థలాలను గుర్తించి, వాటిని పిల్లల పార్కులుగా అభివృద్ధి చేయాలని సికింద్రాబాద్ జోనల్ అధికారులకు కమిషనర్ దిశానిర్దేశం చేశారు. నివాసితులంతా పరిసరాల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఇందిరమ్మ ఇళ్లపై సర్వే
మారేడుపల్లి అంబేద్కర్ కాలనీలో పర్యటించిన కలెక్టర్ దాసరి హరిచందన, నివాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికుల విజ్ఞప్తుల మేరకు, అర్హులైన పేదలకు కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టే అవకాశాలపై ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆమె వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ మంగతాయారు, కవాడిగూడ డిప్యూటీ కమిషనర్ ఆర్.పుష్పలత, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ పాండు నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు..jpeg)
