ముష్కిన్ చెరువులో అక్రమాలకు బ్రేక్: 10 రోజుల్లో ఖాళీ చేయాల్సిందే!

ముష్కిన్ చెరువులో అక్రమాలకు బ్రేక్: 10 రోజుల్లో ఖాళీ చేయాల్సిందే!

నార్సింగి:

భారత శక్తి గండిపేట మండలం నార్సింగి సమీపంలోని ముష్కిన్ చెరువు పరిరక్షణకు హైడ్రా (HYDRAA) నడుం బిగించింది. చెరువు ఎఫ్టీఎల్ (పూర్తి స్థాయి నీటి మట్టం) పరిధిలోని ఆక్రమణలపై బుధవారం అధికారులు కొరడా ఝుళిపించారు. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డులను, వ్యాపార సముదాయాలను పది రోజుల్లోగా స్వచ్ఛందంగా తొలగించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.WhatsApp Image 2026-04-29 at 18.36.01

పేదలను అడ్డుపెట్టుకుని భూకబ్జాలు
చెరువు భూములను కాజేసేందుకు కొందరు కబ్జాదారులు పేదలను పావులుగా వాడుకుంటున్నారని అధికారులు గుర్తించారు. ఎఫ్టీఎల్ పరిధిలో తాత్కాలిక షెడ్డులు వేయించి, వారిని అడ్డం పెట్టుకుని బడా నిర్మాణాలు చేపట్టేందుకు వ్యూహం పన్నినట్లు నిర్ధారించారు. ఇంటింటికీ సేకరించిన చెత్తను చెరువు పరిసరాల్లోనే వేరు చేస్తూ వ్యర్థాలను నీటిలోకి వదలడం వల్ల చెరువు మురికికూపంగా మారుతోందని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా హెచ్చరిస్తున్నా ఆక్రమణదారులు పట్టించుకోకపోవడంతో ఈసారి నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి గడువు విధించారు.

లెక్క తేలింది.. 52.20 ఎకరాలు చెరువుదే!
ముష్కిన్ చెరువు విస్తీర్ణంపై నెలకొన్న సందిగ్ధతకు హెచ్ఎండీఏ (HMDA) రికార్డుల ద్వారా స్పష్టత వచ్చింది.

 * మొత్తం ఎఫ్టీఎల్ పరిధి: 52.20 ఎకరాలు.
 బఫర్ జోన్ కలిపితే సుమారు 62 ఎకరాలు.
 
వివాదాలు: ఒక నిర్మాణ సంస్థ 18 ఎకరాలు తమదేనని వాదిస్తుండగా, మరికొందరు వ్యక్తులు మరో 16 ఎకరాలపై హక్కులు కోరుతున్నారు.

 సర్కారీ భూమి: సుమారు 21 ఎకరాల మేర శిఖం భూమి ఉన్నట్లు లెక్కలు తేల్చారు.
చెరువులోకి వచ్చే వరద కాలువలను మూసివేసి, మట్టితో నింపి ప్రహరీ గోడలు నిర్మించేందుకు ప్రయత్నించిన బడా సంస్థల ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. గతంలో నిర్మించిన అక్రమ ప్రహరీలను సైతం రెవెన్యూ యంత్రాంగం కూల్చివేసింది.WhatsApp Image 2026-04-29 at 18.33.50

చెరువు పునరుద్ధరణే లక్ష్యం
ఆక్రమణలను తొలగించిన అనంతరం 52.20 ఎకరాల విస్తీర్ణంలో చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని హైడ్రా నిర్ణయించింది. చెరువు చుట్టూ బండ్ నిర్మాణం చేపట్టి, పర్యావరణ హితంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పనులకు అడ్డు తగిలితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

హైడ్రా చర్యలపై స్థానికుల హర్షం
లక్షలాది మంది నివసించే ప్రాంతంలో ఉన్న ఏకైక జలవనరును కాపాడుతున్నందుకు స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కబ్జాకు గురవుతున్న వైనంపై గతంలో తాము ఫిర్యాదు చేశామని, స్పందించి తక్షణ చర్యలు తీసుకున్నందుకు ప్రభుత్వానికి, హైడ్రా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.

About The Author