రాజక్కపేటలో అంగన్వాడీ సెంటర్ ఎదుట తల్లిదండ్రుల ధర్నా

కుళ్లిన కోడిగుడ్లు, ఎక్స్‌పైరీ సరుకుల కలకలం

రాజక్కపేటలో అంగన్వాడీ సెంటర్ ఎదుట తల్లిదండ్రుల ధర్నా

సిద్దిపేట:

 సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామంలోని అంగన్వాడీ సెంటర్-1 ఎదుట పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు ధర్నా చేపట్టారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, ఎక్స్‌పైరీ అయిన ఆహార పదార్థాలు పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వారం రోజుల క్రితం అంగన్వాడీ సెంటర్-1లో కుళ్లిపోయిన కోడిగుడ్లు తిని పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, గ్రామస్తులు సెంటర్‌కు చేరుకొని అంగన్వాడీ ఆయాను నిలదీశారు. విషయం తెలుసుకున్న సీడీపీఓ ఎల్లయ్య ఆధ్వర్యంలో అధికారులు సెంటర్‌ను తనిఖీ చేశారు. కుళ్లిన కోడిగుడ్లు, నాసిరకం ఆహార పదార్థాలు ఉండటాన్ని గుర్తించి అంగన్వాడీ టీచర్, ఆయాకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.WhatsApp Image 2026-04-28 at 19.16.32 (1)

ప్రజావాణికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
తమ పిల్లలకు న్యాయం చేయాలని, బాధ్యులైన టీచర్, ఆయాను తొలగించాలని కోరుతూ గ్రామస్తులు సిద్దిపేట కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో దరఖాస్తు అందజేశారు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీలో బయటపడ్డ వాస్తవాలు
జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ జయరాం సెంటర్‌ను తనిఖీ చేశారు. ఎక్స్‌పైర్ అయిన బాలామృతం, పప్పుధాన్యాలు, వంటనూనె, కోడిగుడ్లు, చింతపండును గుర్తించి శాంపిల్స్ సేకరించారు. "అధికారులు నామమాత్రంగా వచ్చి వెళ్తున్నారు తప్ప చర్యలు లేవు" అని ఆరోపిస్తూ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సెంటర్ ఎదుట ధర్నాకు దిగారు.
సర్పంచ్ హామీతో ధర్నా విరమణ
విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని, అంగన్వాడీ సెంటర్‌లో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

About The Author