బడంగ్ పేటలో ‘పార్క్’ మాయం.. ఆరు కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా!

  • రాత్రికి రాత్రే వెలిసిన ప్రహరీ గోడలు.. పురాతన వృక్షాల నరికివేత
  • రామిడి కళావతి, బిఎస్ఆర్ కాలనీల్లో భూ కబ్జా పర్వం
  • అధికారులకు ఫిర్యాదు చేసిన రామిడి శూరకర్ణ రెడ్డి.. క్రిమినల్ చర్యలకు డిమాండ్

బడంగ్ పేటలో ‘పార్క్’ మాయం.. ఆరు కోట్ల ప్రభుత్వ భూమి స్వాహా!

బడంగ్‌పేట్:
అధికార గర్వం, ధనబలం తోడైతే ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. సామాన్యులకు చెందాల్సిన పార్కు స్థలాలను రియల్ మాఫియా అప్పనంగా మింగేస్తోంది. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో సుమారు 6 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన ఉదంతం ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది.WhatsApp Image 2026-04-29 at 15.21.46 (3)

వివరాల్లోకి వెళ్తే..
నాదర్‌గుల్ 57వ డివిజన్ పరిధిలోని అల్మాస్‌గూడ గ్రామంలో గల సర్వే నెంబర్లు 31, 32, 33, 34లలో రామిడి కళావతి కాలనీ మరియు బిఎస్ఆర్ కాలనీలు ఉన్నాయి. గతంలో వెంచర్ వేసిన సమయంలో నిబంధనల ప్రకారం పార్కుల కోసం కేటాయించిన స్థలాలను ఇప్పుడు కబ్జాదారులు తమ సొంతం
 చేసుకుంటున్నారు.WhatsApp Image 2026-04-29 at 15.21.46

మాయాజాలం ఇలా..
రామిడి కళావతి కాలనీలో 294 గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేసిన దుండగులు, అక్కడ ఉన్న పురాతన చింతచెట్టును సైతం నిర్దాక్షిణ్యంగా నరికివేశారు. గతంలో ఇక్కడ ఒక బావి ఉండేదని, వెంచర్ ప్లాట్లు అమ్మే సమయంలో దీనిని పార్కుగా చూపించి ప్రజలను నమ్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అదే స్థలాన్ని పట్టాదారులుగా చెప్పుకుంటూ కొందరు రాత్రికి రాత్రే ప్రహరీ గోడలు నిర్మించి ఆక్రమించుకున్నారు.
మరోవైపు, బిఎస్ఆర్ కాలనీలో ప్రభుత్వ శ్మశానవాటికకు కేటాయించిన 1001 గజాల స్థలాన్ని సైతం వదలకుండా కబ్జా చేశారు. మొత్తం 1295 గజాల ఈ భారీ భూభాగాన్ని కబ్జాదారులు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.WhatsApp Image 2026-04-29 at 15.21.45

పోరాట బాటలో శూరకర్ణ రెడ్డి:
ఈ అక్రమ కబ్జాలపై భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామిడి శూరకర్ణ రెడ్డి గళమెత్తారు. బుధవారం బడంగ్‌పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ప్రజలకు చెందాల్సిన ఆరు కోట్ల విలువైన ఆస్తులను కబ్జా చేస్తున్న వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అధికారుల హామీ:
ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ కమిషనర్, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమ కట్టడాలను తొలగిస్తామని, ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు.
కబ్జాకు గురైన పార్కులను తిరిగి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే వరకు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తన పోరాటం ఆగదని ఈ సందర్భంగా శూరకర్ణ రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు అండగా ఉంటూ పార్కు స్థలాల రక్షణ కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు.WhatsApp Image 2026-04-29 at 15.21.46 (3)WhatsApp Image 2026-04-29 at 15.21.45 (1)WhatsApp Image 2026-04-29 at 15.21.46 (1)

About The Author