డీజీపీ శివధర్ రెడ్డి పదవీ విరమణ
ఇన్‌ఛార్జ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మహేష్ భగవత్*
హైదరాబాద్:
రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీసు ప్రధాన కార్యాలయంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు సహచర అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
ముందుగా శివధర్ రెడ్డి తన బాధ్యతలను శాంతిభద్రతల విభాగం డీజీ మహేష్ ఎం. భగవత్‌కు అప్పగించారు. నూతన డీజీపీగా సి.వి. ఆనంద్ బాధ్యతలు స్వీకరించే వరకు మహేష్ భగవత్ ఇన్ఛార్జ్ డీజీపీగా వ్యవహరిస్తారు. బాధ్యతల అప్పగింత అనంతరం శివధర్ రెడ్డి కార్యాలయానికి వచ్చిన ఐపీఎస్ అధికారులు, సిబ్బందిని పేరుపేరునా పలకరిస్తూ అభివాదం చేశారు.
*సాంప్రదాయ రీతిలో వీడ్కోలు*
అనంతరం పూలతో అలంకరించిన వాహనంపై శివధర్ రెడ్డి నిలబడగా, పోలీసు నిబంధనల ప్రకారం ఐపీఎస్ అధికారులు ఆ వాహనాన్ని తాళ్లతో లాగుతూ ప్రధాన ద్వారం వరకు సాగనంపారు. సిబ్బంది ఆయనపై పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు, ఎస్పీఎఫ్ డీజీ స్వాతి లక్రా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
