తెలంగాణ రక్షణ సేన’కు ఈసీ ఆమోదం

కవితమ్మ చేతుల మీదుగా పార్టీ ప్రకటన.. ‘పాంచజన్యం’తో ప్రజల్లోకి..

తెలంగాణ రక్షణ సేన’కు ఈసీ ఆమోదం

హైదరాబాద్:

తెలంగాణ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయం మొదలైంది. సామాజిక తెలంగాణే లక్ష్యంగా ఆవిర్భవించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు బంజారాహిల్స్‌లోని జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు గురువారం అధికారిక పత్రాన్ని అందజేశారు. ఈ పరిణామం పట్ల పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.

కవితమ్మ ఇంటికి చేరిన అధికారిక పత్రం
ఈ నెల 25న మేడ్చల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ రక్షణ సేన’ ఏర్పాటును ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ నమోదు ప్రక్రియలో భాగంగా ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఐదు పేర్లలో (తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి), ఈసీ మూడవ ప్రాధాన్యత కలిగిన ‘తెలంగాణ రక్షణ సేన’ను ఖరారు చేసింది. టీఆర్ఎస్ (TRS) అనే సంక్షిప్త నామం తిరిగి లభించడం పట్ల నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు.

'పాంచజన్యం’.. ఐదు సూత్రాల భవిష్యత్తు ప్రణాళిక
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఈ పార్టీ ఐదు ప్రధాన హామీలతో (పాంచజన్యం) ప్రజల ముందుకు వెళ్లనుందని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగా రెడ్డి, మేడ్చల్ జిల్లా నేత రామిడి వెంకట్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు మంచిరెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి తెలిపారు. ఆ ఐదు ప్రధానాంశాలు ఇవే:

 1.ఉచిత విద్య: కేజీ నుంచి పీజీ వరకు ప్రతి విద్యార్థికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఉచిత విద్య.
 2. అందరికీ ఆరోగ్యం: పేదలందరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందించడం.
 3.రైతు సంక్షేమం:సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ మరియు గిట్టుబాటు ధరతో పూర్తిస్థాయి మద్దతు.
 4. ఉపాధి కల్పన:సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. యువత స్వయం ఉపాధి కోసం రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణ సదుపాయం.

 5. సమాన ప్రాధాన్యత: రాజకీయ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం మరియు సమాన వాటా.

 "తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, వారి గొంతుకకు దక్కిన తొలి విజయం ఇది. విధి కల్వకుంట్ల కవిత వైపు నిలిచి, తిరిగి ‘టీఆర్ఎస్’ పేరును ఖరారు చేయడం శుభపరిణామం. ఈ పార్టీ రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మిస్తుంది."
కప్పాటి పాండురంగా రెడ్డి*, టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు.

తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుతూనే, సామాజిక న్యాయం దిశగా పార్టీ అడుగులు వేస్తుందని, అతి త్వరలోనే పూర్తిస్థాయి కార్యచరణను ప్రకటించనున్నట్లు నాయకులు స్పష్టం చేశారు.

About The Author