ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి : అడిషనల్ సీఈఓ వాసం వెంకటేశ్వర్ రెడ్డి
సమీక్షా సమావేశంలో మండలాల అధికారులకు ఆదేశం
బడంగ్ పేట్:
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్ ) కార్యక్రమంలో భాగంగా బుధవారం వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఐఏఎస్, అడిషనల్ సీఈఓ తెలంగాణ, మహేశ్వరం అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించిన ఏడు మంది సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AERO), 52 మంది బీఎల్ఓ సూపర్వైజర్లు, బిఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బడంగ్ పేట్ కార్యాలయ మీటింగ్ హాల్ యందు ఈ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో, అడిషనల్ సీఈఓ మాట్లాడుతూ, 2025 ఓటరు జాబితాలోని అర్హులైన ఓటర్లందరినీ 2002 ఓటరు జాబితాతో అనుసంధానించాలని సూచించారు. పట్టణ ప్రాంత నియోజకవర్గాలలో మ్యాపింగ్ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుందని, బీఎల్ఓలు అందరూ ఇంటింటికి వెళ్ళి ఓటర్ల వివరాలు సేకరించి త్వరితగతిన మ్యాపింగ్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బిఎల్ఏల సహాయం తీసుకోవాలని, రెసిడెన్షియల్ కాలనీవాసులతో సమావేశాలు నిర్వహించి అందరినీ మ్యాపింగ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఓటర్లందరూ కూడా సహకరించి ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అందరూ మ్యాపింగ్ చేయించుకోవాలని కోరారు.అర్బన్ ప్రాంతంలో ఎస్ఐఆర్ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని,బడంగ్ పేటలో 26% సరూర్నగర్ సర్కిల్లో 35% జల్ పల్లిలో 38% మాత్రమే ఓటర్ మ్యాపింగ్ ఉండడం వల్ల నియోజకవర్గ మ్యాపింగ్ శాతం కూడా చాలా తక్కువ ఉందని,కమిషనర్లు, తహసీల్దార్లు మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ సీఈఓ వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఐఏఎస్,ఆర్ఓ మరియు ఆర్డిఓ కందుకూరు ఎన్. జగదీశ్వర్ రెడ్డి, బడంగ్ పేట్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య జల్ పల్లి డిప్యూటీ కమిషనర్ వెంకట్రామ్, మహేశ్వరం, సరూర్నగర్, బాలాపూర్ తహసీల్దార్లు చిన్న అప్పల నాయుడు, వేణుగోపాల్,ఇందిరా దేవీ,సరూర్నగర్ సర్కిల్ సహాయ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావు,కందుకూరు డిప్యూటీ తహశీల్దార్ శేఖర్,బిఎల్ఓ సూపర్వైజర్లు పలువురు బిఎల్ఓలు పాల్గొన్నారు.
