నకిలీ పత్రాలతో నయా దందా! రాంపల్లి భూ ఆక్రమణ కేసులో నలుగురి అరెస్ట్
ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ. 73 లక్షల లోన్
కీసర:
విలువైన భూమిపై కన్నేసి, నకిలీ పత్రాలు సృష్టించి, ఏకంగా బ్యాంకులనే బురిడీ కొట్టించిన నలుగురు నిందితులను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. రాంపల్లి గ్రామంలో వెలుగుచూసిన ఈ భూ ఆక్రమణ, ఫోర్జరీ ఉదంతానికి సంబంధించిన వివరాలను మల్కాజిగిరి డీసీపీ సి.హెచ్. శ్రీధర్ వెల్లడించారు.
అక్రమ ప్రవేశం.. ధ్వంసం
రాంపల్లి గ్రామం సర్వే నంబర్ 385లో ఫిర్యాదుదారు రేఖా రెడ్డి కుటుంబానికి చెందిన భూమి ఉంది. ఈ స్థలాన్ని కబ్జా చేసే ఉద్దేశంతో సుబ్బారెడ్డి (A1) తన అనుచరులతో కలిసి అక్రమంగా ప్రవేశించాడు. అక్కడ ఉన్న కాంపౌండ్ వాల్, బోర్ మోటార్‌తో పాటు నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేశాడు.
పథకం ప్రకారం ఫోర్జరీ..
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. లోన్ ఏజెంట్ శ్రీధర్ రెడ్డి సలహాతో సుబ్బారెడ్డి, తన అనుచరులు రవి (A2), వెంకటేష్ (A3) సాయంతో నకిలీ భూమి పత్రాలను సృష్టించాడు. జమ్మల నాగేష్ (A4)కు భూమి లేకపోయినప్పటికీ, రిజిస్ట్రేషన్ సమయంలో మరొక గుర్తు తెలియని వ్యక్తిని పంపి, ఫోటోలు, సంతకాలు మార్చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందితో కుమ్మక్కై అక్రమంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు.
లోన్ దందా: ఈ ఫోర్జరీ పత్రాలను బ్యాంకులో కుదువ పెట్టిన నిందితులు రూ. 73 లక్షల రుణం పొంది, ఆ మొత్తాన్ని పంచుకున్నారు.
బ్లాక్ మెయిలింగ్: భూమి ధర పెరగడంతో అదే నకిలీ పత్రాలతో మరికొందరికి అగ్రిమెంట్లు చేసి వసూళ్లకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, అసలు యజమాని అయిన ఫిర్యాదుదారురాలిపైనే కౌంటర్ కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు.
పక్కా ఆధారాలతో సుబ్బారెడ్డి, రవి, వెంకటేష్, జమ్మల నాగేష్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన ఏసీపీ చక్రపాణి, ఇన్‌స్పెక్టర్ ఆంజనేయలు, ఎస్.ఐ హరిప్రసాద్ బృందాన్ని డీసీపీ అభినందించారు. కేసులో ప్రమేయం ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

