పోలీస్ బాస్ ఆనంద్ -శాంతిభద్రతల వారధి.. సంస్కరణల సారథి
- -సవాళ్లే ఆయనకు సోపానాలు
- -మైదానం నుంచి డీజీపీ పీఠం వరకు
- -సీవీ ఆనంద్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం
హైదరాబాద్:
అతడు మైదానంలోకి దిగి బ్యాట్ ఝాలిపించాడంటే పరుగుల వరద.. ఖాకీ దుస్తులు ధరిస్తే నేరగాళ్ల గుండెల్లో వణుకు.. పరిపాలన పగ్గాలు చేపడితే రూ.వేల కోట్ల ప్రజాధనానికి రక్షణ. తెలంగాణ రాష్ట్ర నూతన పోలీస్ బాస్ (డీజీపీ)గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ అంటే కేవలం ఒక పేరు కాదు. అదొక నిరంతర సంస్కరణల ప్రవాహం. అంతే కాదు అదొక బ్రాండ్. హైదరాబాద్ గల్లీల నుంచి రాష్ట్ర పోలీస్ అత్యున్నత శిఖరం వరకు ఆయన సాగించిన ప్రయాణం అసాధారణం, స్ఫూర్తిదాయకం.
విషాదం నుంచి విస్ఫోటనం..
సీవీ ఆనంద్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన కుటుంబ నేపథ్యాన్ని చూడాలి. ఐఎఫ్ఎస్ అధికారి సి.దామోదర్ రెడ్డి కుమారుడిగా క్రమశిక్షణతో పెరిగిన ఆనంద్ జీవితంలో ఒక మలుపు ఆయన అన్నయ్య వినోద్ మరణం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా ఉంటూ మిగ్ విమాన ప్రమాదంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సోదరుడి వీరత్వం, ఆనంద్ లో బలమైన దేశభక్తిని నింపింది. క్రికెట్ మీద మక్కువ ఉన్నా, సోదరుడి బాటలో దేశానికి సేవ చేయాలనే పట్టుదలతో ఐపీఎస్ వైపు అడుగులు వేశారు. కేవలం 22 ఏళ్లకే, తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ సాధించి తన లక్ష్యాన్ని ముద్దాడారు..jpeg)
బ్యాట్ పడితే బాదుడే..
ఆయన ఒక అరుదైన 'స్పోర్ట్స్ పోలీస్'. నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు స్టార్ క్రికెటర్‌గా వెలిగారు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన అండర్-19 జట్టులో సభ్యుడు. ఆ క్రీడా స్ఫూర్తే ఆయనను విధి నిర్వహణలోనూ వేగంగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తోంది.
గన్ పాయింట్....
వరంగల్, అదిలాబాద్ అడవుల్లో నక్సల్స్‌తో ముఖాముఖి తలపడిన ధైర్యశాలి. మెడల్స్ విషయానికి వస్తే...ప్రాణాలకు తెగించి పోరాడినందుకు గాను 2002లో 'రాష్ట్రపతి గ్యాలంట్రీ మెడల్' ఆయన ధైర్యానికి నిదర్శనం.
ఒక పోలీస్ అధికారి కేవలం లా అండ్ ఆర్డర్ మాత్రమే చూస్తారనే అపోహను ఆయన పటాపంచలు చేశారు.
1.పౌర సరఫరాల శాఖలో ఆయన ప్రవేశపెట్టిన టెక్నాలజీ (e-PoS) ద్వారా అక్రమ రవాణాకు చెక్ పడింది. తద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.2,000 కోట్లు ఆదా కావడం ఒక రికార్డు.
2. ట్రాఫిక్ సంస్కరణలను పరిశీలిస్తే...ఈ రోజు మనం చూస్తున్న 'డ్రంక్ అండ్ డ్రైవ్' తనిఖీలు, ఈ-చలాన్ల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఆనంద్ గారే.

కుటుంబం.. వ్యక్తిత్వం: నిరాడంబర నిశ్చలత్వం
ఆయన భార్య లలిత ఆనంద్ విద్యావేత్తగా తనదైన గుర్తింపు పొందగా, కుమారుడు చామ మిలింద్ క్రికెట్‌లో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రంజీ ప్లేయర్‌గా ఎదిగారు. వృత్తిలో ఎంత కఠినంగా ఉంటారో, వ్యక్తిగతంగా అంత నిరాడంబరంగా ఉండటం ఆయన ప్రత్యేకత. ఐటీ కారిడార్‌లో మహిళల భద్రత కోసం 'షీ షటిల్స్' ప్రారంభించినా, సైబర్ నేరగాళ్ల ఆట కట్టించినా ఆయన విజన్ ఎప్పుడూ భవిష్యత్తు వైపే ఉంటుంది.
ముందున్న లక్ష్యం: స్మార్ట్ పోలీసింగ్
తెలంగాణ డీజీపీగా ఇప్పుడు ఆయన ముందు ఏఐ (AI), సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సవాళ్లు ఉన్నాయి. తన సుదీర్ఘ అనుభవంతో, క్రీడాకారుడి వేగంతో రాష్ట్ర రక్షణ వ్యవస్థను ఆయన మరో మెట్టు ఎక్కించనున్నారని పోలీస్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
శాంతిభద్రతల పరిరక్షణలో ఆయనో నిఘా నేత్రం.. సంస్కరణల అమలులో ఒక ఉప్పెన.. సీవీ ఆనంద్ - ది పీపుల్స్ పోలీస్!
