ఓటర్ల జాబితా ప్రక్షాళన.. మ్యాపింగ్‌కు కసరత్తు
- రంగంలోకి అధికారులు.. కాలనీ అసోసియేషన్లతో భేటీ
- కేబీఆర్ పార్క్ వద్ద హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
హైదరాబాద్:
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఓటర్ల జాబితా నవీకరణ, మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఎన్నికల కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి (DEO) ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా విస్తృత చర్యలు చేపట్టారు. ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
రంగంలోకి RWAలు, ఉద్యోగ సంఘాలు
ఓటర్ల మ్యాపింగ్‌పై హైదరాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWA), కాలనీ సంఘాల ప్రతినిధులతో అదనపు కమిషనర్ కె. చంద్రకళ, సీవీఓ అబ్దుల్ వకీల్ సమావేశమయ్యారు. 2002 నుండి 2025 మధ్య కాలానికి సంబంధించిన ఓటర్ల వివరాల మ్యాపింగ్‌పై వారికి దిశానిర్దేశం చేశారు. సుమారు 200 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో.. బూత్ లెవల్ ఆఫీసర్ల (BLO) సమన్వయంతో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని అసోసియేషన్లు హామీ ఇచ్చాయి.
మరోవైపు జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల సంఘంతోనూ అధికారులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యుల వివరాలతో సహా మ్యాపింగ్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఏసీ సత్యనారాయణ కోరారు.
ఉదయం వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండేలా కేబీఆర్ పార్క్ వద్ద ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. పార్కుకు వచ్చే వాకర్స్‌కు ఓటర్ల మ్యాపింగ్ ప్రాధాన్యతను వివరిస్తూ, అక్కడికక్కడే నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా వంద శాతం ఖచ్చితత్వంతో రూపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు.

