
కరీంనగర్ :
రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ, మొదటి, రెండవ విడత నామినేషన్ల స్వీకరణ, దాఖలైన నామినేషన్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండవ విడత నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, మూడవ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కూడా తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎన్నికల సిబ్బంది కేటాయింపు, పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ బాక్సులు, శాంతిభద్రతలు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ కాన్ఫరెన్స్ లో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ మొదటి విడతలో 92 సర్పంచ్ స్థానాలకు 730 నామినేషన్లు, 866 వార్డు సభ్యుల స్థానాలకు 2174 నామినేషన్లు దాఖలు అయ్యాయని చెప్పారు. రెండో విడతలో 113 సర్పంచ్ స్థానాలకు 888, 1046 వార్డు సభ్యుల స్థానాలకు 3056 నామినేషన్లు దాఖలు అయినట్టు వెల్లడించారు. నామినేషన్ వేయని సర్పంచ్ లేదా వార్డు సభ్యుల స్థానాలు ఇప్పటివరకు లేవని తెలిపారు. 125 వార్డు స్థానాలకు ఒకే ఒక నామినేషన్ దాఖలు అయినట్లు వెల్లడించారు. 2946 పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో మొదటి, రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, మొదటి దశ నామినేషన్ల పరిశీలన కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికలను స్వేచ్చాయుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయిలలో అధికారులతో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని తెలిపారు. 19 శాతం పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైన గుర్తించి పటిష్ట బందోబస్తుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న 635 మందిని బైండోవర్ చేశామని, 33 లైసెన్స్ తుపాకులను డిపాజిట్ చేసుకున్నామని వివరించారు. ఇప్పటివరకు 70 అక్రమ మద్యం కేసులు, ఎన్ డి పి ఎస్ చట్టం కేసు ఒకటి నమోదైనట్లు వెల్లడించారు. గ్రామ పోలీసు అధికారులను కేటాయించి క్షేత్రస్థాయిలో ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, సిపితో పాటు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఎన్నికల పరిశీలకులు వెంకటేశ్వర్లు, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.