నగర స్వచ్ఛతలో మీ పాత్ర కీలకం
- ట్రై కార్పొరేషన్ల కమిషనర్ల పిలుపు
- స్వచ్ఛ ఆటో కార్మికులతో ప్రత్యేక భేటీ
- ఉద్యోగ భద్రత, బీమాపై కమిషనర్ల హామీ
- వంద శాతం చెత్త సేకరిస్తామని కార్మికుల స్పష్టీకరణ
హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి (ట్రై కార్పొరేషన్ల) పరిధిని ఆదర్శవంతంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు పూర్తిస్థాయిలో సహకరించాలని కమిషనర్లు ఆర్.వి.కర్ణన్, జి.సృజన, టి.వినయ్ కృష్ణారెడ్డి కోరారు. శుక్రవారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, కార్మికులతో వారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమిషనర్లు ఓపిగ్గా విని, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు.
100 రోజుల ప్రణాళికలో సానిటేషన్‌కే పెద్దపీట
ఈ సందర్భంగా కమిషనర్లు మాట్లాడుతూ.. క్యూర్ (CURE) పరిధిలోని మూడు కార్పొరేషన్లలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా త్వరలో '100 రోజుల కార్యాచరణ' ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రాథమిక సేకరణే ముఖ్యం: నగరంలోని ప్రధాన రహదారులు, కాలనీల్లో ఎక్కడా చెత్త కుప్పలు కనిపించకూడదంటే ఇంటింటి నుంచి చెత్త సేకరణ (ప్రైమరీ కలెక్షన్) పకడ్బందీగా జరగాలని, ఇందులో స్వచ్ఛ ఆటోల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
వంద శాతం సేకరణ: తమకు కేటాయించిన డివిజన్లలో ప్రతి ఇల్లు కవర్ అయ్యేలా వంద శాతం చెత్తను సేకరించాలని సూచించారు.
కార్మికుల సంక్షేమం పట్ల కమిషనర్లు పలు కీలక హామీలు ఇచ్చారు:
నిరీక్షణకు చెక్: చెత్త అన్‌లోడింగ్ పాయింట్ల వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు అవసరమైన చోట 'పోర్టబుల్ ట్రాన్స్‌ఫర్ పాయింట్లను' ఏర్పాటు చేస్తామన్నారు.
ఆర్టీఓ ఇబ్బందులు లేకుండా: రవాణా అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేస్తామని భరోసా ఇచ్చారు.
కార్మికుల ప్రతిజ్ఞ:
అధికారుల హామీల పట్ల హర్షం వ్యక్తం చేసిన స్వచ్ఛ ఆటో కార్మికులు.. తాము క్రమం తప్పకుండా విధులకు హాజరవుతామని, ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి నగర స్వచ్ఛతలో భాగస్వాములవుతామని స్పష్టం చేశారు. ఏదైనా కారణంతో విధులకు రాలేకపోతే ముందే ఎస్.ఎఫ్.ఏ (SFA)లకు సమాచారం అందిస్తామని, తద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సహకరిస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు రఘు ప్రసాద్, రవి కిరణ్, యాదగిరి రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
