అక్రమాలకు అక్షయపాత్ర.. ‘లాగిన్’ వెనుక మాయాజాలం!
- సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయంలో విస్తుపోయే వాస్తవాలు
- సస్పెన్షన్ల పర్వం వెనుక పెద్దలని కాపాడే వ్యూహం?
- అవినీతికి ‘డిజిటల్’ రక్షణ.. సస్పెన్షన్ల వెనుక అసలు దొంగలెవరు?
సరూర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో సాగుతున్న ‘లాగిన్’ అక్రమాలు వ్యవస్థలోని కుళ్లిపోయిన తీరుకు అద్దం పడుతున్నాయి. డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, ఏఎంసీల వ్యక్తిగత లాగిన్ల ద్వారా కేవలం గంట వ్యవధిలోనే అక్రమ అసెస్మెంట్ పూర్తికావడం వెనుక బలమైన శాస్త్రీయ ఆధారాలు (IP Address & Time Logs) ఉన్నప్పటికీ, జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ మౌనం వహించడం వెనుక అంతర్యమేమిటి?
చిన్నపాటి లోపాలకు బిల్ కలెక్టర్లను బలిపశువులను చేస్తూ, కోట్ల రూపాయల ఆదాయానికి గండి కొడుతున్న ఉన్నతాధికారులను కాపాడటం ‘సహాయ నిరాకరణ’ కిందకు రాదా? సొంత పాస్‌వర్డ్‌ల రక్షణపై కనీస అవగాహన లేని వారు ఆ కుర్చీల్లో కూర్చోవడానికి అనర్హులు. విచారణలో నిగ్గు తేలిన ఈ ‘డిజిటల్ దోపిడీ’పై తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోకపోతే, అది ఉన్నతాధికారుల అవినీతి భాగస్వామ్యాన్ని ధ్రువీకరించినట్లే అవుతుంది. సూత్రధారులను వదిలి పాత్రధారులను శిక్షిస్తే వ్యవస్థ బాగుపడుతుందా?
ఎల్బీనగర్:
మున్సిపల్ రెవెన్యూ విభాగం అవినీతికి నిలయంగా మారుతోంది. సామాన్యుడు ఒక నూతన ఇంటి నంబర్ లేదా అసెస్మెంట్ కోసం నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటే, తెర వెనుక చక్రం తిప్పే ‘ముఠా’కు మాత్రం గంటల వ్యవధిలోనే పనులు పూర్తవుతున్నాయి. మన్సూరాబాద్‌లోని ఒక ఇంటి నంబర్ కేటాయింపులో జరిగిన ‘మెరుపు వేగపు’ ప్రక్రియ ఇప్పుడు ఉన్నతాధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది.
గంటలోనే పని పూర్తి.. మాకు తెలియదంటే నమ్మేదెలా?
మన్సూరాబాద్ పరిధిలోని ఇంటి నంబర్ 3-8-439/1 కు సంబంధించి పిటిఐఎన్ (PTIN: 1050315474) కేటాయింపు వ్యవహారం సర్కారు ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది.
రికార్డు వేగం: సాధారణంగా రోజుల సమయం పట్టే అసెస్మెంట్ ప్రక్రియ, సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, ఏఎంసీ శ్రీనివాసరావుల లాగిన్ల ద్వారా కేవలం ఒక గంట వ్యవధిలోనే పూర్తవ్వడం గమనార్హం.
అమాయకపు సమాధానాలు: మీ అధికారిక లాగిన్ల నుండే ఈ ప్రక్రియ జరిగింది కదా అని ప్రశ్నిస్తే.. "మాకు తెలియకుండానే జరిగిపోయింది" అంటూ సదరు అధికారులు చెబుతున్న సమాధానాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఉన్నతాధికారుల పాస్‌వర్డ్‌లు బయటి వ్యక్తులకు ఎలా తెలిశాయి? లేక తెలిసే ఇదంతా జరిగిందా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది..jpeg)
ముఖ్య అంశాలు:
పని పూర్తి చేసిన వారెవరో?: అధికారుల లాగిన్ వాడిందెవరు? ఆ గంటలో అసలు ఏం జరిగింది?
పోలీసు ఫిర్యాదు ఊసే లేదు: ఐడిలు దుర్వినియోగం అయ్యాయని చెబుతున్న అధికారులు, రెండు నెలలుగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఎందుకు దాటవేస్తున్నారు?
పట్టించుకోని విజిలెన్స్: ఇంత బహిరంగంగా అక్రమాలు జరుగుతున్నా విజిలెన్స్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏమిటి?
బలిపశువు బిల్ కలెక్టర్.. సూత్రధారులు సేఫ్?
ఇటీవల చంపాపేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో బిల్ కలెక్టర్ సాయికిరణ్‌ను సస్పెండ్ చేశారు. అయితే, ఇది కేవలం కంటితుడుపు చర్యేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చిన్న చేపలకే శిక్షా?: నోటీసులు ఇవ్వలేదని, పన్నులు వసూలు చేయలేదని కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్న కమిషనర్, తన కళ్ళ ముందే జరుగుతున్న ‘లాగిన్’ అక్రమాలపై ఎందుకు మౌనంగా ఉన్నారు?
అసలు దొంగలెవరు?: సరూర్ నగర్ డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల ప్రమేయంపై ఆరోపణలు వస్తున్నా, వారిని కాపాడేందుకే బిల్ కలెక్టర్ సస్పెన్షన్ డ్రామా ఆడుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సమగ్ర విచారణే పరిష్కారం
మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ, ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి అక్రమ అసెస్మెంట్లు చేస్తున్న పెద్దల గుట్టు రట్టు కావాల్సి ఉంది. కేవలం క్షేత్రస్థాయి సిబ్బందిని సస్పెండ్ చేస్తే సరిపోదని, డిజిటల్ సంతకాలు, లాగిన్ ఐపి అడ్రస్‌ల ఆధారంగా సమగ్ర విచారణ జరిపితేనే అసలు సూత్రధారులు బయటపడతారని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు..jpeg)
