ఓటరు జాబితా ప్రక్షాళనపై 'సుదర్శనం'

  • ప్రోజెన్సీ మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
  • ​సికింద్రాబాద్, చార్మినార్‌ పరిధిలో ఆకస్మిక తనిఖీ.. క్షేత్రస్థాయిలో ప్రక్రియ పరిశీలన

ఓటరు జాబితా ప్రక్షాళనపై 'సుదర్శనం'

​హైదరాబాద్‌:
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రక్రియలో భాగంగా చేపట్టిన 'ప్రోజెన్సీ మ్యాపింగ్‌' (Progeny Mapping) సర్వేను అత్యంత పారదర్శకతతో, వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్‌తో కలిసి నగరంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న మ్యాపింగ్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
​క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు
​సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మాణికేశ్వర్‌ నగర్ (పోలింగ్ కేంద్రం 211), చార్మినార్ నియోజకవర్గంలోని కబుత్తర్‌ ఖానా (పోలింగ్ కేంద్రం 12) పరిధిలో జరుగుతున్న సర్వేను సిఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLO), సూపర్ వైజర్లతో మాట్లాడి మ్యాపింగ్ విధానంపై వారికి ఉన్న అవగాహనను స్వయంగా పరీక్షించారు.
​మ్యాపింగ్ ప్రక్రియ ఇలా..
​ఇంటింటి సర్వేలో భాగంగా అధికారులు అనుసరిస్తున్న తీరును సిఈఓకు బీఎల్ఓలు వివరించారు:
​పోలిక: 2002 నాటి ఓటరు జాబితాలోని వివరాలను, ప్రస్తుత 2025 జాబితాతో పోల్చి చూస్తున్నారు.

​గుర్తింపు: పాత జాబితాలో ఉన్న ఓటర్ల కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి, వారు ప్రస్తుత జాబితాలో ఉంటే వారిని మ్యాపింగ్ చేస్తున్నారు.

​లక్ష్యం: దీనివల్ల ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా పక్కాగా జాబితాను రూపొందించవచ్చు.
​ఖచ్చితత్వమే పరమావధి
​ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. "భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాలో ఖచ్చితత్వం, పారదర్శకత చాలా ముఖ్యం. ఏ ఒక్క అర్హుడు ఓటు హక్కు కోల్పోకూడదు. ఈ ప్రోజెన్సీ మ్యాపింగ్‌ ద్వారా ఓటరు జాబితాలోని తప్పులను సరిదిద్దవచ్చు. ఈ ప్రక్రియను ఈఆర్‌ఓ (ERO), ఏఈఆర్‌ఓ (AERO)లు నిరంతరం పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలి," అని స్పష్టం చేశారు.

: ఓటరు జాబితా సవరణలో భాగంగా జరిగే ఈ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని, తమ కుటుంబ సభ్యుల వివరాలను బీఎల్ఓలకు అందించి జాబితాలో కచ్చితత్వం ఉండేలా చూడాలని అధికారులు కోరారు.

About The Author

Related Posts