చెరువుల పునరుద్ధరణకు హైడ్రా ‘రెండో విడత’ ప్రణాళిక

  • ఎఫ్‌టీఎల్ పరిధిలో మార్పుల్లేవు.. ఆక్రమణలపై ఉక్కుపాదం
  • ​గంగారం, ఈర్ల చెరువుల వద్ద క్షేత్రస్థాయి పరిశీలన

చెరువుల పునరుద్ధరణకు హైడ్రా ‘రెండో విడత’ ప్రణాళిక

​హైదరాబాద్:

నగరంలో చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ పనులను హైడ్రా (HYDRAA) వేగవంతం చేసింది. రెండో విడతలో భాగంగా ఎంపిక చేసిన 14 చెరువుల అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. బుధవారం రామచంద్రాపురంలోని గంగారం చెరువు (111 ఎకరాలు), ఈర్ల చెరువు (32 ఎకరాలు)లను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువుల్లోకి నేరుగా మురుగునీరు చేరడం, గుర్రపుడెక్క పేరుకుపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఆయన, తక్షణమే ప్రక్షాళన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

​మురుగునీటి మళ్లింపు.. 
ఎస్‌టీపీల నిర్మాణం

వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువులు ప్రస్తుతం మురుగునీటి ప్రవాహంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. వరద కాలువలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నేరుగా మురుగునీరు చెరువుల్లో కలవడమే దీనికి ప్రధాన కారణమని హైడ్రా గుర్తించింది. మురుగు నీటిని మళ్లించి, ఎస్‌టీపీ (మురుగునీటి శుద్ధి కేంద్రం)ల ద్వారా శుద్ధి చేసిన తర్వాతే చెరువులోకి వదిలేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని కమిషనర్ సూచించారు. ఇందుకోసం అవసరమైన సెడిమెంటేషన్ పాండ్‌ల నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని ఆదేశించారు.WhatsApp Image 2026-02-25 at 20.47.51

​ఎఫ్‌టీఎల్ నిబంధనల్లో రాజీ లేదు:

సున్నం చెరువుతో పాటు నగరంలోని ఏ చెరువు ఎఫ్‌టీఎల్ (పూర్తి స్థాయి నీటి మట్టం) పరిధిలోనూ మార్పులు ఉండబోవని హైడ్రా స్పష్టం చేసింది. 2014లో నిర్ణయించిన హద్దుల ప్రకారమే అభివృద్ధి పనులు జరుగుతాయని, హైకోర్టు ఉత్తర్వులకు లోబడే చర్యలు ఉంటాయని కమిషనర్ వివరించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన విమర్శలను ఆయన తోసిపుచ్చారు. "గతంలో హైడ్రా చర్యలను అభినందించిన ఎమ్మెల్యే, ఇప్పుడు వ్యక్తిగత విమర్శలకు దిగడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు" అని వ్యాఖ్యానించారు.

​ఆక్రమణల తొలగింపు - ప్రజా ప్రయోజనం:

హైడ్రా ఇప్పటివరకు 1240 చోట్ల ఆక్రమణలను తొలగించి, సుమారు 1310 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ముఖ్యంగా భూముల విలువ ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి జోన్ నుంచే 40 శాతం ఫిర్యాదులు వస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న భూములను కేవలం ఖాళీగా ఉంచడమే కాకుండా, వాటిని ప్రజావసరాలకు వినియోగిస్తున్నారు.

​గాజులరామారం: స్వాధీనం చేసుకున్న 300 ఎకరాలను సాంఘిక సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయింపు.
​కొండాపూర్: కాపాడిన 7 ఎకరాలను విద్యా సంస్థలు, పార్కుల అభివృద్ధికి అప్పగింత.WhatsApp Image 2026-02-25 at 20.47.21

​పర్యావరణ హితంగా సుందరీకరణ

చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోని ప్రభుత్వ భూమిని రక్షించడమే కాకుండా, అక్కడ ప్రజల కోసం పార్కులు, చిన్నారుల ప్లే ఏరియాలు, సీటింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. చెరువుల చుట్టూ నీడనిచ్చే చెట్లను పెంచి, పర్యావరణహితమైన నగర నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది.

About The Author