బల్దియా ఖజానాకు 'అవినీతి' గండి!
- సరూర్ నగర్ సర్కిల్‌లో పన్నుల మాయాజాలం.
- ట్రేడ్ లైసెన్స్‌లో ఒక లెక్క.. ఆస్తి పన్నులో మరోక లెక్క
- నిబంధనలు తుంగలో తొక్కి..అక్రమ 'అసెస్మెంట్'లతో కోట్లు కొల్లగొడుతున్న అధికారులు
- సరూర్నగర్ సర్కిల్ డి.సి బోనగిరి శ్రీనివాస్ కు జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ సపోర్ట్.
- జిహెచ్ఎంసి కొత్త కమిషనరేట్ మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఐఏఎస్ ఏం చర్యలు తీసుకుంటారు..?
- క్షేత్రస్థాయిలో తిమింగలాలు.. ఏసీబీ, విజిలెన్స్ విచారణకు సామాన్యుల డిమాండ్
- అవినీతి తేటతెల్లమైన అధికారులపై చర్యలు శూన్యం మున్సిపల్ శాఖ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి
హైదరాబాద్:
ప్రభుత్వ ఆదాయానికి రక్షణగా ఉండాల్సిన అధికారులే భక్షకులుగా మారారు. నిబంధనల తుంగలో తొక్కి, బడా వ్యాపారులతో చేతులు కలిపి జీహెచ్‌ఎంసీ (GHMC) ఖజానాకు కన్నం వేస్తున్నారు. సరూర్ నగర్ సర్కిల్ కేంద్రంగా సాగుతున్న ఈ 'పన్ను'గడ అక్షరాలా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తోంది. గ్రౌండ్ + 5 అంతస్తుల మేడలున్నా, కాగితాల్లో మాత్రం వాటిని 'గుడిసె'ల స్థాయికి తగ్గించి చూపిస్తూ అక్రమ సంపాదనకు తెర లేపారు. ఈ వ్యవహారంలో బల్దియా అధికారుల లాగిన్లను సైతం దుర్వినియోగం, ఇతర సర్కిళ్ల పరిధిలోకి వెళ్లి మరీ చేస్తున్న 'వసూళ్ల' పర్వం ఇప్పుడు కలకలం రేపుతోంది.
పన్నుల మాయాజాలం: సాయిరాం హాస్పిటల్ సాక్షిగా..
ట్రేడ్ లైసెన్స్ లెక్క: హాస్పిటల్ ట్రేడ్ లైసెన్స్ (టిన్ : TR-0802-045-0002) ప్రకారం భవన విస్తీర్ణం 17,817 చదరపు అడుగులు. దీనికోసం రూ. 53,451 ఫీజు చెల్లించారు.
అక్రమం: అధికారుల 'ముడుపుల' మత్తు వల్ల దాదాపు 9,080 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని పన్ను పరిధి నుంచి తప్పించారు. దీనివల్ల ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ. 12 లక్షల ఆదాయాన్ని కోల్పోతోంది.
సాయిరాం హాస్పిటల్ ట్రేడ్ లైసెన్స్ కూడా తప్పుగా చేసారు .. డబల్ రోడ్ అయితే సింగల్ రోడ్ అని పెట్టి ఇంఛార్జ్ ఎఎంసీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది ....
పేద మధ్య తరగతి ప్రజలు డోర్ నెంబర్ అసెస్మెంట్ కోసం అప్లై చేసుకుంటే వాళ్ళ చెప్పులు అరిగేలా ఆఫీస్ చుట్టూ తిప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోనిదే పని పూర్తి చేయడం లేదు అలాంటిది ఓల్డ్ హయత్ నగర్ సర్కిల్ కి సంబంధించిన డోర్ నెంబర్ అసెస్మెంట్ అప్లై చేసినాక ఒక గంటలో పని పూర్తి చేసారు. పక్కన సర్కిల్ కి సంబంధించిన తప్పుడు పనిచేయడానికి చూపించిన శ్రద్ధ సరూర్ నగర్ సర్కిల్ కి సంబంధించిన రెవిన్యూ విభాగం లాగిన్స్ లో నెలల తరబడి పెట్టుకోవడంలో ఎందుకు చూపించడం లేదు..
డీసీని కలిస్తే ఏఎంసి చేసాడు అని కింది స్థాయి అధికారులపైకి తోస్తున్నాడు తప్ప తప్పు చేసిందెవరు ? తప్పు చేసిన వాళ్ళ పైన ఏమి యాక్షన్ తీసుకుంటారని కాకుండా కాలయాపన చేయడం చూస్తుంటే అందరూ కలిసే లక్షల్లో మింగేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్
కోణార్క్ థియేటర్ వద్ద 'అక్రమ' సముదాయం
కోణార్క్ థియేటర్ ఎదురుగా ఉన్న ఐదంతస్తుల (G+5) భారీ వ్యాపార సముదాయం అధికారుల అక్రమాలకు పరాకాష్ట. ఈ భవనంలోని ఒక హోటల్ ట్రేడ్ లైసెన్స్ విస్తీర్ణం 2,500 అడుగులు ఉంటే, మొత్తం ఐదు అంతస్తుల భవనం ఆస్తి పన్ను రికార్డుల్లో మాత్రం కేవలం 1,550 చదరపు అడుగులే ఉండటం గమనార్హం. ఏడాదికి రూ. 10 లక్షల పన్ను కట్టాల్సిన చోట, అధికారుల పుణ్యమా అని కేవలం రూ. 86,898తో యజమానులు సరిపెడుతున్నారు.
హద్దులు దాటిన 'వసూళ్ల' వేట!.
సరూర్ నగర్ అధికారులు తమ సర్కిల్ పరిధి దాటి హయత్ నగర్ సర్కిల్ లోని ఆస్తులకు కూడా అక్రమంగా అసెస్మెంట్ చేస్తూ లక్షలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మన్సూరాబాద్‌లోని ఓ భవనానికి (నెం: 3-8-439/1), నిబంధనలకు విరుద్ధంగా సరూర్ నగర్ అధికారుల లాగిన్ ద్వారా కేవలం ఒక్క గంటలోనే అసెస్మెంట్ పూర్తి చేయడం బల్దియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అమాయకత్వం నటిస్తున్న అధికారులు:
డిప్యూటీ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, ఏఏంసీ శ్రీనివాసరావుల లాగిన్ల నుంచే ఈ పనులు పూర్తయినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ.. "మాకు తెలియకుండానే జరిగిపోయింది" అని వారు బుకాయించడం గమనార్హం. తప్పు జరగకపోతే వెంటనే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు.
ప్రజాప్రతినిధుల ఆదేశాలకూ బేఖాతరు...!
దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్ ప్రాంతాల్లో వందలాది హాస్టళ్లు, వాణిజ్య సముదాయాలు వెలిసినా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వయంగా జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ కు పన్నులను సవరించాలని సూచించినా, క్షేత్రస్థాయి అధికారులు మాత్రం 'మామూళ్ల' మత్తులో జోగుతూ కాలయాపన చేస్తున్నారు.
విజిలెన్స్ మౌనం.. అనుమానాల వెల్లువ!
ఈ బాగోతం బయటపడి రెండు నెలలు గడుస్తున్నా, విజిలెన్స్ అధికారులు మౌనం వహించడం వెనుక ఉన్న అంతర్యమేమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న తరుణంలో, ఇలాంటి అవినీతి తిమింగలాలు ప్రభుత్వ ఖజానాకు కన్నం వేయడంపై ఏసీబీ (ACB) రంగంలోకి దిగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నూతన కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి మరియు సీఎం రేవంత్ రెడ్డి ఈ 'పన్ను'గడపై ఉక్కుపాదం మోపుతారో లేదో వేచి చూడాలి.
