చెత్త సేకరణపై ‘క్యూఆర్’ నిఘా

పైలట్‌ ప్రాజెక్టును పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్.వి కర్ణన్

చెత్త సేకరణపై ‘క్యూఆర్’ నిఘా

హైదరాబాద్‌:

నగరంలో ఇంటింటా చెత్త సేకరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘క్యూఆర్‌ కోడ్‌’ ఆధారిత విధానం సత్ఫలితాలనిస్తుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్.వి. కర్ణన్ పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా పారిశుద్ధ్య నిర్వహణలో జవాబుదారీతనం పెరుగుతుందని, ప్రతి ఇల్లు కవర్ అయ్యేలా పర్యవేక్షించవచ్చని స్పష్టం చేశారు.
​రాజేంద్రనగర్‌ జోన్, అత్తాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని హైదర్‌గూడ నలందానగర్‌లో కొనసాగుతున్న క్యూఆర్‌ కోడ్ ఆధారిత చెత్త సేకరణ పైలట్‌ ప్రాజెక్టును మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కమిషనర్ (శానిటేషన్) రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యతో కలిసి స్వచ్ఛ ఆటోల పనితీరును, చెత్త సేకరణ తీరును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

​అధికారులకు కమిషనర్ జారీ చేసిన కీలక ఆదేశాలు:

​నిరంతర పర్యవేక్షణ: ప్రతిరోజూ తప్పనిసరిగా ఇంటింటా చెత్త సేకరించేలా డిప్యూటీ కమిషనర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఇంజనీర్లు పర్యవేక్షించాలి.
​నిర్లక్ష్యంపై హెచ్చరిక: పారిశుద్ధ్య కార్మికుల హాజరు, పనితీరులో అలసత్వం వహించినా, సూపర్వైజర్ల పర్యవేక్షణ లోపించినా కఠిన చర్యలు తప్పవు.
​ప్రజల్లో అవగాహన: స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వని గృహాలను గుర్తించి, వారిని చైతన్యపరచాలి. ప్రజల భాగస్వామ్యంతోనే నగరం పరిశుభ్రంగా ఉంటుందని గుర్తించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.

​త్వరితగతిన పరిష్కారం: పారిశుద్ధ్య సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి పరిష్కరించాలి.
​నగరం అంతటా అమలుకు ప్రణాళిక:
ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాలు సానుకూలంగా ఉంటే, రాబోయే రోజుల్లో జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.WhatsApp Image 2026-02-24 at 20.02.46 (1)

About The Author