రాచకొండ పేరు మార్చి... మల్కాజ్‌గిరి సెక్యూరిటీ కౌన్సిల్ షురూ!

  • సెక్యూరిటీ కౌన్సిల్‌లో భారీ మార్పులు.. సీపీ అవినాష్ మహంతి సరికొత్త ప్లాన్
  • ​పేరు మార్పు వెనుక అసలు కథ ఇదే.. క్షేత్రస్థాయిలోకి పోలీసింగ్

రాచకొండ పేరు మార్చి... మల్కాజ్‌గిరి సెక్యూరిటీ కౌన్సిల్ షురూ!

హైదరాబాద్:

రాచకొండ కమిషనరేట్ పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు 'రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్' (RKSC) గా ఉన్న సంస్థ, ఇకపై 'మల్కాజ్‌గిరి సెక్యూరిటీ కౌన్సిల్' (MKSC) గా అవతరించింది. కేవలం పేరు మార్చడమే కాదు, క్షేత్రస్థాయిలో నేరాల నియంత్రణకు సీపీ అవినాష్ మహంతి పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. శనివారం నేరెడ్‌మెట్ కమిషనరేట్‌లో జరిగిన మీటింగ్‌లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

​ఎందుకీ మార్పు?

​రాచకొండ కమిషనరేట్ విభజన తర్వాత భౌగోళిక పరిస్థితులు మారాయి. ప్రస్తుతం కార్యకలాపాలన్నీ మల్కాజ్‌గిరి కేంద్రంగానే సాగుతుండటంతో, పారిశ్రామిక వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు ఈ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారు.

సీపీ టార్గెట్లు.. 

డీసీపీల పర్యవేక్షణ
​కొత్తగా రూపుదిద్దుకున్న MKSCలో జవాబుదారీతనం పెంచేందుకు సీపీ కఠిన నిబంధనలు పెట్టారు:
​త్రైమాసిక లక్ష్యాలు: ప్రతి మూడు నెలలకోసారి ఏం సాధించామో రిపోర్ట్ ఇవ్వాలి.

​డీసీపీలే కన్వీనర్లు: ట్రాఫిక్, సైబర్ క్రైమ్, మహిళా భద్రత విభాగాలకు డీసీపీ స్థాయి అధికారులను కన్వీనర్లుగా నియమించారు. దీనివల్ల పోలీసులకు, కౌన్సిల్‌కు మధ్య గ్యాప్ ఉండదు.WhatsApp Image 2026-02-22 at 15.23.21

​టార్గెట్ 'సైబర్ నేరాలు'.. ఇక డిజిటల్ హైజీన్!

​ప్రస్తుతం ఫోన్ లింకులు, ఫేక్ యాప్‌లతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. అందుకే ఐటీ కంపెనీలకే కాకుండా, చిన్న పరిశ్రమలు (MSME), నాన్-ఐటీ సంస్థలకు కూడా 'డిజిటల్ హైజీన్' (డిజిటల్ పరిశుభ్రత)పై పాఠాలు చెప్పాలని నిర్ణయించారు. సైబర్ సెక్యూరిటీ ఫోరమ్ ద్వారా ఇంటింటికీ అవగాహన తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు.

మహిళల కోసం 'మార్గదర్శి'.. ట్రాఫిక్ కోసం 'మార్షల్స్'

​మహిళల భద్రత కోసం గతంలో సక్సెస్ అయిన 'మార్గదర్శక్' ప్రోగ్రామ్‌ను మళ్లీ రీస్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ఆఫీసులో ఒక మహిళా ప్రతినిధిని 'మార్గదర్శి'గా నియమించి, మహిళా ఉద్యోగులకు భరోసా కల్పించనున్నారు.
మరోవైపు, పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తట్టుకునేందుకు 'స్పాన్సర్డ్ ట్రాఫిక్ మార్షల్స్' కాన్సెప్ట్‌ను తెచ్చారు. కార్పొరేట్ కంపెనీల సీఎస్‌ఆర్ (CSR) నిధులతో సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ కష్టాలు తీర్చనున్నారు.

​హైలైట్స్:
​ఎలక్ట్రిక్ పెట్రోలింగ్: పర్యావరణం కోసం ఈవీ వాహనాలను వాడాలనే ఆలోచన.
​సీసీటీవీల మెయింటెనెన్స్: టెక్నాలజీ సాయంతో నేరగాళ్లకు చెక్ పెట్టడం.
​కొత్త టీమ్: వైస్ ఛైర్మన్ పి. సుధాకర్, సెక్రటరీ డాక్టర్ రఘువీర్ నేతృత్వంలో కొత్త కార్యవర్గం బాధ్యతలు.

​పోలీస్-ప్రజల మధ్య గ్యాప్ తగ్గించి, మల్కాజ్‌గిరిని క్రైమ్ ఫ్రీ జోన్‌గా మార్చడమే లక్ష్యంగా MKSC అడుగులు వేస్తోంది. ఇది కేవలం పేపర్ మీద ప్లాన్ కాకుండా గ్రౌండ్ లెవల్లో అమలైతేనే ఫలితం ఉంటుంది.

About The Author