అలంకార ప్రియుడికి ఘనంగా అభిషేకం

మణుగూరు :
మున్సిపాలిటీ పరిధిలో స్వయంబుగా వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయ సమీపంలో గల అయ్యప్పస్వామి శివాలయం పీఠంలో అర్చకులు బాలాజీ శర్మ , గురుస్వాములు విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం అలంకార ప్రియుడికి అష్ఠాదశ ద్రవ్యాలతో ఘనంగా అభిషేకం నిర్వహించారు. ముందుగా నిత్య పూజలో భాగంగా గణపతి, షణ్ముఖ, శ్రీ మణికంఠునికి అష్టోత్తర నామాలతో గురుస్వామి విద్యాసాగర్ రెడ్డి కన్నె స్వామితో పూజలు చేయించారు. అనంతరం అయ్యప్ప స్వామి మాలధరించిన స్వాముల గోత్ర నామాలతో ఆలయ అర్చకులు బాలాజీ శర్మ గౌరమ్మకు, వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామికి ఎంతో ప్రీతికరమైన బుధవారం పర్వదినం పురస్కరించుకుని అయ్యప్ప స్వామిని జలంతో శుద్ధి చేసి వివిధ రకాల పండ్ల రసాలు, అష్టమూలికల తైలం, పన్నీరు, పంచామృతాలతో వేదమంత్రాల నడుమ అభిషేకం నిర్వహించారు. గంగజలం పసుపు, కుంకుమ, గంధం, విభూధితో శుద్ధి చేసిన జలంను దోషాలు తొలగించాలని మాలధరించిన అయ్యప్ప స్వాములపై చల్లి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో శివాలయం పీఠం గురుస్వాములు నుకలపాటి నాగేశ్వరరావు, బోడ బాలాజీ, కృష్ణ, పెరు స్వాములు కనుకు రమేష్, నరేంద్ర రెడ్డి, కన్నె స్వాములు, కత్తి స్వాములు , గంట స్వాములు పుల్లారావు, గథ స్వాములు తదితరులు పాల్గొన్నారు.
