కాంగ్రెస్...బిఆర్ఎస్ పాలనలో ప్రజల బతుకులు ఆగం
- బిజెపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి
- బిజెపి జిల్లా అధికార ప్రతినిధి , సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు కళ్యాణ్ చంద్ర

కరీంనగర్ :
దశాబ్దాలు దేశాన్ని రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేని దుస్థితులు ఉన్నాయని, 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం పంచాయతీల పటిష్టత, గ్రామ స్వరాజ్యం కోసం ఎంతో కృషి చేసి, గ్రామాల ముఖచిత్రాన్ని మార్చిందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి , సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 55 ఏళ్ళు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ గ్రామాల అభివృద్ధి , ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేసిందేమీలేదని విమర్శించారు. గ్రామాల్లోని మహిళల ఆత్మగౌరవం కోసం ఆలోచన చేయలేని స్థితిలో కాంగ్రెస్ పాలన కొనసాగిందన్నారు. గ్రామాల్లో కనీస మౌలిక వసతులు రోడ్లు, మురికి కాలువలు , వీధి దీపాలను ఏర్పాటు చేయడంలో దశాబ్దాల కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యమైన పంచాయతీలను, గ్రామాలను పటిష్టం చేయడానికి కేంద్రంలోని మోదీ సర్కార్ కృషి చేసిందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించే లక్ష్యంతో, గ్రామాల రూపురేఖలు మార్చే ఆశయంతో పనిచేస్తుందని తెలిపారు. గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు , వీధి దీపాలు , సెంట్రల్ లైటింగ్ , డంపింగ్ యార్డ్ , స్మశాన వాటికలు , అంగన్వాడి కేంద్రాలు, పల్లె ప్రకృతి వనాలు , రైతు వేదిక లాంటి ఎన్నో ప్రధానమైన పనులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిందన్నారు. గ్రామాల్లో మహిళలు ఆత్మగౌరవంతో జీవించడానికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, కట్టెల పొయ్యి బాధల నుండి మహిళలకు విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ఉజ్వల గ్యాస్ యోజన పథకాన్ని తీసుకో వచ్చిన ఘనత మోది ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నేడు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచుల జీవితాలతో ఆడుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం నిధులు ఇస్తే , ఆ నిధులను పక్కదారి పట్టించిన చరిత్ర గత కెసిఆర్ సర్కార్ కి ఉందని విమర్శించారు. గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దయనీయ పరిస్థితులు బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో వచ్చాయని తెలిపారు. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్లను ఆదుకుంటామని , గ్రామ పాలన వ్యవస్థను గాడిలో పెడతామని ఊదరగొట్టు మాటలు చెప్పిందే తప్ప ఆచరణలో చేసిందేమీ లేదన్నారు. అప్పుల పాలైన సర్పంచుల బాధలను పట్టించుకోకుండా, రెండేళ్లుగా గ్రామ పాలనా వ్యవస్థను గాలికి వదిలేసి, పంచాయతీలకు ఒక్క రూపాయి ఇవ్వకుండా గ్రామాలను కాంగ్రెస్ సర్కార్ గోసపెట్టిందన్నారు. రెండేళ్ల కాలంగా గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు కేంద్రం నుండి రావాల్సిన నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధుల కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంది తప్ప పంచాయతీల మీద ప్రేమతో కాదనే విషయాన్ని ప్రజలంతా గ్రహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు, పంచాయతీ సిబ్బంది వ్యయ, నిర్వహణలు సర్దుబాటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. సొమ్ము ఒకరి దైతే సోకు మరొకరిది అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉందని , పూర్తిస్థాయి కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామాల్లో జరిగిన పనులకు నేటి కాంగ్రెస్ , గత బిఆర్ఎస్ లు తమ క్రెడిట్ అని గొప్పలు చెప్పుకొని ప్రజానీకాన్ని తీవ్రంగా మోసం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, బి ఆర్ ఎస్ అభ్యర్థులకు ఓటు వేయడం దండగని , బిజెపి అభ్యర్థులకు ఓటు వేస్తే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ , బిఆర్ఎస్ మాయమాటలకు గ్రామ ప్రజలు మోసపోకుండా , జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో బిజెపికి అవకాశం ఇవ్వాలని కోరారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని , ఆ దిశగా పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాలలో వందల కోట్ల నిధులు అభివృద్ధి పనుల కోసం మంజూరు చేయించారని ఆయన ఈ గుర్తు చేశారు. గ్రామాల అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యమని , అందుకే పంచాయతీ ఎన్నికల్లో బిజెపి బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
