
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో :
జిల్లాలో ఈనెల పదకొండవ తేదీన (గురువారం) జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ప్రచారంపై అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే ఆరు మండలాలు అయిన దస్తురాబాద్, ఖానాపూర్, పెంబి, కడెం, లక్ష్మణచందా, మామడల పరిధిలో నేటి సాయంత్రం ఐదు గంటల (17:00 గం.లు) వరకు తప్పనిసరిగా అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత బహిరంగ ప్రచారానికి అనుమతి ఉండదు.
నిషేధాజ్ఞల అమలు: ఎన్నికల సజావుగా నిర్వహణ కోసం ఇప్పటికే ఈ ఆరు మండలాల్లో నిషేధాజ్ఞలు ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి (సెక్షన్ 163 BNSS) అమలులోకి వస్తాయి. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధం. మద్యం దుకాణాలు బంద్: ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కాగా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను 11వ తేదీ, గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించబడుతుంది. పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు (డిసెంబర్ 11నాడు) సాయంత్రం ఓట్లను లెక్కించి, ఫలితాల వెల్లడి జరుగుతుంది.