
కరీంనగర్ :
కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎర్రోజు దేవేందర్ (53) గుండెపోటు కారణంగా సోమవారం మృతి చెందారు. హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ ఉదయం కరీంనగర్‌లోని గాంధీ చౌరస్తాలో మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ డ్యూటీలో పాల్గొన్నారు.
డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 1992లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరిన దేవేందర్, ఆ తర్వాత సివిల్ పోలీసు కానిస్టేబుల్‌గా కన్వర్షన్ పొంది, ప్రస్తుతం హెడ్ కానిస్టేబుల్‌గా తన సేవలు అందిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మృతి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సమాచారం తెలిసిన వెంటనే ట్రాఫిక్ ఏసీపీ, సీఐలు, ఎస్ఐలు తదితర పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.