విపత్తు వేళ.. యువతే భరోసా!

  • సికింద్రాబాద్‌లో ‘సివిల్ డిఫెన్స్’ శిక్షణ ప్రారంభం
  • ​ఏడు రోజుల పాటు ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక కార్యక్రమం పాల్గొన్న మాజీ డీజీపీ అరుణా బహుగుణ

విపత్తు వేళ.. యువతే భరోసా!

సికింద్రాబాద్:

 ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా విపత్తు సంభవించినప్పుడు అగ్నిమాపక, పోలీసు యంత్రాంగం వచ్చే వరకు వేచి చూడటం వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. ఈ లోటును భర్తీ చేసేందుకు, యువతను ‘తొలి స్పందనకారులు’గా (ఫస్ట్ రెస్పాండర్స్) తీర్చిదిద్దేందుకు తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం నడుం బిగించింది. 

సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ సెంటనరీ డిగ్రీ కాలేజీలో సోమవారం నుంచి ఏడు రోజుల పాటు ‘సివిల్ డిఫెన్స్ వాలంటీర్ ట్రైనింగ్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

​ప్రమాదాల్లో యువత పాత్ర కీలకం..

కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ డీజీపీ అరుణా బహుగుణ మాట్లాడుతూ.. ప్రమాద స్థలంలో అత్యవసర సేవలు అందేలోపు స్థానిక యువత స్పందించి సహాయం చేయడం ప్రాణాలను కాపాడటంలో కీలకమన్నారు. ఇలాంటి శిక్షణ ద్వారా యువతను ఆపద కాలంలో ఆదుకునే శక్తివంతులుగా మారుస్తామన్నారు.

​శిక్షణలో ఏం నేర్పిస్తారంటే..

ఈ ఏడు రోజుల పాటు జరిగే శిక్షణలో వాలంటీర్లకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తారు:
​రెస్క్యూ ఆపరేషన్స్: ప్రమాదాల నుంచి బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావడం.

​ఫైర్ ఫైటింగ్: మంటలను ఆర్పే ఆధునిక పద్ధతులు.

​ఫస్ట్ ఎయిడ్: ప్రాథమిక చికిత్స అందించడం.

​క్రౌడ్ కంట్రోల్: రద్దీగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులో ఉంచడం.

​అత్యవసర స్పందన: యుద్ధ పరిస్థితులు, రసాయన, అణు దాడులు జరిగినప్పుడు ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేయడం.

​ఈ శిక్షణ పూర్తి చేసుకున్న వాలంటీర్లు పోలీసు, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలతో కలిసి విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ సివిల్ డిఫెన్స్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఎఫ్ఓ బి. సుధాకర్ రావు, డీఎఫ్ఓ దాస్, అకాడమిక్స్ డీన్ డాక్టర్ కళ్యాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియప్పన్, మహ్మద్ అబ్దుల్ రహీమ్ పాల్గొన్నారు.

About The Author