ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి స్పందించాలి
గజ్వేల్ సీపీఐ నాయకులు
గజ్వేల్:
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ బస్సు డిపో ముందు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీపీఐ పార్టీ నాయకులు సమ్మె శిబిరాన్ని సందర్శించి కార్మికులకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని వారు గుర్తు చేశారు. కార్మికులను చర్చలకు పిలవకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని, గతంలో కార్మికులతో ఘర్షణ పడ్డ ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని హెచ్చరించారు. తక్షణమే ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు స్వర్గం రాజేశం, నియోజకవర్గ ఇన్చార్జి శివలింగ కృష్ణ, పార్టీ నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు మరియు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
