జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేయాలి
- - నిరాధార ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
- - యువత కబడ్డి క్రీడలో రాణించాలి
- - జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్‌సి సంతోష్
గజ్వేల్:
సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వైశ్య భవన్‌లో అన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్‌సి సంతోష్ కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు. సమ్మర్ శిక్షణ శిబిరాలు నిర్వహించడం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా ఛాంపియన్షిప్ ట్రోఫీ టోర్నమెంట్ నిర్వహించడం, ఈ సంవత్సరంలో పర్మనెంట్ కబడ్డీ గ్రౌండ్ ఏర్పాటు చేయడం, నిత్య శిక్షణ శిబిరాలు నిర్వహించడం వంటి అంశాలపై చర్చించి, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేయడానికి కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు.
అదేవిధంగా పలు కమిటీల ఏర్పాటు కోసం కోర్ కమిటీని ఏర్పాటు చేసి, అందులో సత్యం, రాజు, శ్రీకాంత్, నరేంద్ర బాబు, మహేష్‌లను నియమించారు. అలాగే సిద్దిపేట జిల్లా నుండి అమేచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అర్హత సాధించిన రాగుల రమ్య, చిల్లి మహేష్‌లను, సీనియర్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్న వంశీకృష్ణను జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కుంటనొల్ల శివకుమార్, కార్యవర్గ సభ్యులు సన్మానించి అభినందించారు.
ఇక సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్న మేడ్చల్ జిల్లాకు చెందిన వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజు, కోశాధికారి సత్యం, సంయుక్త కార్యదర్శులు రాజు, శ్రీకాంత్, నరేంద్ర బాబు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
