'సూపర్ సిక్స్' పథకాలలో ఒకటైన 'స్త్రీ శక్తి' పథకం అమలు
తిరుపతి జిల్లా ప్రతి నిధి, ఆగష్టు 16(భారత శక్తి):
రాష్ట్ర ప్రభుత్వం 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళలకు, ట్రాన్స్‌జెండర్లకు గొప్ప బహుమతిని అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 'సూపర్ సిక్స్' పథకాలలో ముఖ్యమైన ' స్త్రీ శక్తి' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడింది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన 'స్త్రీ శక్తి' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మహిళలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తిరుపతి రూరల్ మండలంలోని ఆర్టీఏ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా పల్లె వెలుగు బస్సు స్టీరింగ్ పట్టి పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ బస్సులను నారావారిపల్లె, అప్పలాయగుంట, బాకరాపేట మీదుగా యర్రావారిపాలెం వద్ద గల ఓ.ఎస్. గొల్లపల్లి, పాకాలకు మొత్తం 6 బస్సులుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి, మహిళా నాయకురాలు పులివర్తి సుధారెడ్డి కూడా పాల్గొన్నారు. ఆమె మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి, వారికి ఉచిత జీరో ఫేర్ టికెట్లు అందజేస్తూ ఉత్సాహాన్ని నింపారు. ఈ ప్రయాణంలో వారు మహిళలతో మాట్లాడి వారి సమస్యలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు.
ఈ పథకం ద్వారా 5 రకాల పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, అల్ట్రా ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సులలో వారు ఉచితంగా ప్రయాణించవచ్చు, ఈ పథకం మహిళలు, ట్రాన్స్‌జెండర్ల ఆర్థిక భారాన్ని తగ్గించి, వారికి సామాజికంగా, ఆర్థికంగా ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించబడింది. ప్రయాణ సమయంలో చూపించవలసిన గుర్తింపు కార్డులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు ఏదైనా ఒకటి చూపించి మీరు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు.
