బడా బాబులకు 'రాజ'భోగం.. సామాన్యుడికి పన్ను 'పోటు'!
సరూర్ నగర్ సర్కిల్ లో భారీ పన్ను గోల్‌మాల్.. 20 వేల చదరపు అడుగుల మాయ!
అక్రమార్కులతో అధికారుల 'మందు' పార్టీలు.. చూసీచూడనట్లు వదిలేస్తున్న జోనల్ కమిషనర్?
హైదరాబాద్:
పేదవాడు గూడు కట్టుకుంటే పన్ను వేటు వేసేందుకు ఉరుకులు పరుగులు పెట్టే బల్దియా అధికారులు, బడా వ్యాపారుల భారీ భవనాల వద్దకు వచ్చేసరికి 'వినయ విధేయత' ప్రదర్శిస్తున్నారు. సామాన్యుడిపై ప్రతాపం చూపే అధికారుల పలకరింపులు, లక్షల రూపాయల పన్ను ఎగవేసే తిమింగలాల వద్ద మాత్రం 'మామూళ్ల' మత్తులో మునిగిపోతున్నాయి. జీహెచ్‌ఎంసీ సరూర్ నగర్ సర్కిల్-5 పరిధిలో వెలుగుచూసిన ఈ భారీ పన్ను అక్రమ ఉదంతం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.
రికార్డుల్లో కోత.. జేబుల్లో రాత!
సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారిపై ఉన్న ఒక భారీ భవన సముదాయం (Property) పన్ను చెల్లింపులో అంతులేని అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి సుమారు 49,400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాల్సిన సదరు ప్రాపర్టీని, అధికారుల అండదండలతో రికార్డుల్లో మాత్రం కేవలం 29,582 చదరపు అడుగులుగానే చూపిస్తున్నారు. అంటే దాదాపు 20 వేల చదరపు అడుగులకు పన్ను ఎగవేస్తూ ప్రభుత్వ ఖజానాకు కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. ఈ అక్రమాలకు సూత్రధారిగా ఉన్న ఒక ఇన్‌చార్జ్ ఏఎంసీ (AMC), పన్నుల వసూళ్ల కంటే విలాసాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
మందు.. విందు.. మామూళ్లు!
సదరు ప్రాపర్టీ యజమాని ఇచ్చే విందుల్లో పన్ను ఇన్‌స్పెక్టర్లతో కలిసి ఏఎంసీ నిత్యం 'మందు' పార్టీలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం అంతా స్థానిక ఉన్నతాధికారి (DC) ఆశీస్సులతోనే జరుగుతోందని, నెలకు అందాల్సిన 'కిరాణా' (మామూళ్లు) గట్టిగా అందుతుండటంతో ఆయన కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కార్యాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే భవనానికి సంబంధించి రూ. 5 లక్షల పన్ను నగదు రూపంలో ఇస్తే, కేవలం రూ. 2 లక్షలు మాత్రమే ప్రభుత్వ ఖాతాలో జమ చేసి, మిగిలిన రూ. 3 లక్షలను ఇంచార్జ్ ఏఎంసీ తన జేబులో వేసుకున్నట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.
సరూర్ నగర్ సర్కిల్ లో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా, మన్సూరాబాద్ అసెస్మెంట్ లో అవకతవకలు బయటపడి నెలలు గడుస్తున్నా.. జోనల్ కమిషనర్ హేమంత్ పటేల్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గడ్డిఅన్నారం పరిధిలో సామాన్య పన్ను దారులు తమ దరఖాస్తుల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నా అధికారుల కనికరం కలగడం లేదు.
చేయి తడిపితే: దరఖాస్తు చేసిన మరుసటి రోజే అప్రూవల్ వస్తుంది.
నీతిగా ఉంటే: అన్ని పత్రాలు ఉన్నా నెలలు, ఏళ్ల తరబడి ఆన్‌లైన్ లో 'పెండింగ్' లేదా 'రిజెక్ట్' ముద్ర వేస్తున్నారు.
కుప్పలు తెప్పలుగా ఆన్‌లైన్ లో పెండింగ్ ఉన్న అప్లికేషన్లపై, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన అధికారులపై జోనల్ కమిషనర్ ఎందుకు ఉక్కుపాదం మోపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిన్న దుకాణాలను సీజ్ చేసే ఉత్సాహం, లక్షల పన్ను ఎగవేస్తున్న ఈ బడా భవనంపై ఎందుకు చూపడం లేదు? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపితే తప్ప ఈ 'పన్ను దోపిడీ'కి అడ్డుకట్ట పడదు.


