అంజి ప్రసాద్ మృతి కాపు సంఘానికి తీరని లోటు: మధుయాష్కి గౌడ్
వనస్థలిపురం:
వనస్థలిపురం కాపు సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు అంజి ప్రసాద్ హఠాన్మరణం పట్ల టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటుతో అంజి ప్రసాద్ మరణించిన విషయం తెలిసి, ఆయన నివాసానికి వెళ్లిన మధుయాష్కి పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులకు ధైర్యం
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ ఎన్జీవోస్ కాలనీలోని అంజి ప్రసాద్ నివాసంలో మధుయాష్కి కొద్దిసేపు గడిపారు. ఆయన మృతితో దుఃఖంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. అంజి ప్రసాద్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సంతాప కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మకుటం సదాశివుడు, ఎల్బీనగర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ మాధవి, నాయకులు పర్వతి గణేష్ రెడ్డి, భీమిడి రామకృష్ణారెడ్డి, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి వినయ్ పటేల్, కొండోజు శ్రీనివాస్, అంతటి శ్రీనివాస్ గౌడ్, సాయికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
