మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా బి. సుమతి బాధ్యతల స్వీకరణ
- శాంతిభద్రతల పరిరక్షణే పరమావధి.. టెక్నాలజీతో నేరాలకు చెక్
- సైబర్ మోసాలు, డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక నిఘా
- ప్రయాణీకుల భద్రతకు ప్రాధాన్యం: ట్రాఫిక్ నియంత్రణకు పెద్దపీట
- కమిషనరేట్‌కు తొలి మహిళా బాస్
మల్కాజిగిరి:
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి బి. సుమతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మల్కాజిగిరి కమిషనరేట్‌కు తొలి మహిళా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమెకు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె తన ప్రాధాన్యతలను వివరించారు.
సాంకేతికతే ఆయుధంగా ‘క్వాలిటీ పోలీసింగ్’
నేరాల నియంత్రణలో పాత పద్ధతులకు స్వస్తి పలికి, అత్యాధునిక సాంకేతికతను (Technology) జోడించడం ద్వారా ఫలితాలను సాధిస్తామని సీపీ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత “TG QUEST”అప్లికేషన్ వినియోగిస్తూ నేరస్తుల ఆట కట్టిస్తామన్నారు. "టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌తో పాటు సేవల నాణ్యత (Quality of Policing) పెంచడమే మా లక్ష్యం. ప్రజలకు అత్యంత పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం" అని ఆమె పేర్కొన్నారు.
నానాటికీ విస్తరిస్తున్న సైబర్ నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సుమతి హెచ్చరించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరేలా ‘ప్రాసెస్ ఓరియెంటెడ్ & రిజల్ట్ ఓరియెంటెడ్’ విధానాన్ని అమలు చేస్తామన్నారు. సమాజానికి శాపంగా మారిన మాదకద్రవ్యాల (Drugs) సరఫరా, వినియోగంపై రాజీలేని పోరాటం చేస్తామని, ఇందుకోసం ‘ప్రివెన్షన్, డిటెక్షన్, ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్’ అనే త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా యువత పెడదారి పట్టకుండా ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తామని వివరించారు.
ట్రాఫిక్ చిక్కులకు చెక్.. సురక్షిత ప్రయాణం
కమిషనరేట్ పరిధిలో వాహనాల రద్దీని క్రమబద్ధీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సీపీ వెల్లడించారు. "ప్రతి పౌరుడి ప్రయాణ సేఫ్టీని మెరుగుపరచడమే మా మొదటి ప్రాధాన్యత. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పెద్దపీట వేస్తాం" అని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో మల్కాజిగిరి ప్రాంతానికి ఉన్న మంచి పేరును నిలబెడుతూ, బాధ్యతాయుతమైన టీమ్‌గా ప్రజలకు అండగా ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలియజేశారు.
