న్యాయస్థానంలోనే 'చీకటి' వ్యవహారం!

  • రికార్డుల అదృశ్యం.. నిందితులతో సిబ్బంది కుమ్మక్కు?
  • రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ కోర్టులో కలకలం రేపుతున్న న్యాయవాది ఫిర్యాదు

న్యాయస్థానంలోనే 'చీకటి' వ్యవహారం!

హయత్‌నగర్

న్యాయమే కదా ఆశ్రయం అని నమ్మిన సామాన్యుడికి, ఆ న్యాయం జరిగే చోటే అన్యాయం జరిగితే ఎలా ఉంటుంది? తాజాగా రంగారెడ్డి జిల్లా, హయత్‌నగర్‌లోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్-VII అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో చోటుచేసుకున్నట్లుగా చెబుతున్న ఒక సంఘటన న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసులో కోర్టు ఉత్తర్వులే అదృశ్యమయ్యాయని, ఈ మొత్తం వ్యవహారంలో కోర్టు సిబ్బంది, నిందితుడు మరియు ఆయన తరపు న్యాయవాది కుమ్మక్కయ్యారని హైకోర్టు న్యాయవాది బి. సుభాష్ హయత్ నగర్ కోర్టు జడ్జి గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని విశ్వసనీయ సమాచారం..

​ఏమిటా కేసు?

వనస్థలిపురం పోలీసుల ఎఫ్.ఐ.ఆర్ నం. 672/2022కి సంబంధించి తుది నివేదికలో 'యాక్షన్ డ్రాప్డ్' (Action dropped) అని పేర్కొన్న నేపథ్యంలో, కోర్టు నిబంధనల ప్రకారం ఫిర్యాదుదారుడైన జి. రాజుకు 2023 జనవరి 10న నోటీసులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు డోకెట్‌లో స్పష్టమైన ఆదేశాలు నమోదయ్యాయి. 2023 ఫిబ్రవరి 20న ఫిర్యాదుదారుడు కోర్టుకు హాజరై ప్రొటెస్ట్ పిటిషన్ కోసం సమయం కోరగా, కోర్టు ఆ విన్నపాన్ని స్వీకరించి కేసును మార్చి 2, 2023కి వాయిదా వేసింది.

​తప్పుదారి పట్టించే ప్రయత్నం!

నిర్ణీత తేదీన, అంటే 02-03-2023న ఫిర్యాదుదారుడు వకాలత్ దాఖలు చేసినా, పిటిషన్ సమర్పించలేదు. దీంతో సదరు కేసును ముగింపు (closed) చేస్తూ గౌరవ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఆ ఫైల్ రికార్డు సెక్షన్‌కు వెళ్లాల్సి ఉండగా, అంతా తలకిందులైంది. కోర్టు సిబ్బంది కొంతమంది, నిందితుడు జి. రాజు మరియు ఆయన తరపు న్యాయవాది ఎ. రాధికతో కుమ్మక్కై, ఆ కీలక ఉత్తర్వులను దాచిపెట్టారని న్యాయవాది సుభాష్ తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది జూలై 17న, పూర్తిగా వాస్తవాలను తప్పుదారి పట్టించేలా అబద్ధపు సమాచారంతో కూడిన నోట్‌ను తిరిగి ప్రిసైడింగ్ ఆఫీసర్ ముందు ఉంచారని ఆయన ఆరోపించారు.

న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం:

"న్యాయస్థానంలోనే ఇలాంటి చీకటి ఒప్పందాలు జరగడం ఆందోళనకరం. ఇది సామాన్యుడికి చట్టంపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది" అని సుభాష్ ఆవేదన చెందారు. జరిగిన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, తప్పు చేసిన సిబ్బందిని, నిందితుడు జి. రాజును, న్యాయవాది ఎ. రాధికను కఠినంగా శిక్షించాలని ఆయన కోరుతున్నారు. ఈ మొత్తం ఘటనపై రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి గారు తగిన చర్యలు తీసుకోవాలని, విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోర్టు రికార్డుల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత కలిగిన వారే ఇలాంటి పనులకు ఒడిగడితే, సామాన్యుడికి దిక్కెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దేవుడిగా భావించే జడ్జిగారు ఈ విషయంపై దృష్టి సారించి న్యాయ వ్యవస్థ అబాసుపాలు కాకుండా రక్షించాలని స్థానిక ప్రజలు  విజ్ఞప్తి చేస్తున్నారు.

About The Author

Related Posts