నల్లగొండ నడిబొడ్డున ‘ప్రజాపాలన’ శంఖారావం

  • రూ.13,006 కోట్లతో రహదారుల విప్లవం.. కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు!
  • *కనగల్‌లో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హమ్) రహదారుల పైలాన్ ఆవిష్కరణ
     
    *441 రోడ్ల విస్తరణ.. 6,092 కిలోమీటర్ల మేర అధునాతన రవాణా వ్యవస్థకు శ్రీకారం
  •  *రూ.83 కోట్లతో నల్లగొండ తాగునీటి పథకం ఫేజ్-1కు శంకుస్థాపన
  •  *పదేళ్ల విధ్వంసంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం: బీఆర్ఎస్, బీజేపీలకు ముఖ్యమంత్రి సవాల్
  •  *"మూసీ ప్రక్షాళన, ఎస్ఎల్బీసీ పూర్తి చేసి తీరుతా.. అడ్డుకుంటే తొక్కుకుంటూ పోతాం"

నల్లగొండ నడిబొడ్డున ‘ప్రజాపాలన’ శంఖారావం

నల్లగొండ: 

తెలంగాణను ప్రగతి పథంలో నడిపించడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం భారీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తొలుత కనగల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో నల్లగొండ-దేవరకొండ రహదారిపై రూ.13,006.27 కోట్ల వ్యయంతో, 6,092.37 కిలోమీటర్ల మేర 441 రహదారులను విస్తరించే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) ప్రాజెక్టు పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
అనంతరం నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల  మైదానానికి చేరుకుని, టీ.యూ.ఎఫ్ఐ.డీ.సీ  ఆధ్వర్యంలో రూ.83 కోట్లతో చేపట్టనున్న మొదటి దశ తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపై మునుపెన్నడూ లేని రీతిలో పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు.

*త్యాగాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం
తొలి, మలి తెలంగాణ ఉద్యమాల్లో నల్లగొండ జిల్లా పాత్రను సీఎం కొనియాడారు. "తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, మలి దశ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర సాధన కోసం తమ మంత్రి పదవులను త్యాగం చేశారు. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి లాంటి ఎందరో అమరవీరుల త్యాగాల పునాదులపై తెలంగాణ సిద్ధించింది. కానీ, కేసీఆర్ కుటుంబం మాత్రం రాజీనామాలు చేయడం, ఎన్నికలు తేవడం, కలెక్షన్లు చేసుకోవడాన్నే త్యాగంగా చెప్పుకుంటోంది" అని సీఎం ఎద్దేవా చేశారు. వంద రూపాయల పెట్రోల్ పోసుకుని అమరులైన వారి త్యాగాలు గొప్పవా? పది పైసల అగ్గిపెట్టె దొరకని 'అగ్గిపెట్టె రావు' పదేళ్ల పాటు మంత్రి పదవి అనుభవించడం త్యాగమా? అని ప్రశ్నించారు.WhatsApp Image 2026-06-28 at 19.55.25 (1)

*పదేళ్లలో 100 ఏళ్ల విధ్వంసం: కేసీఆర్ ఫ్యామిలీపై సామాజిక బహిష్కరణ

 "రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పులతో తెలంగాణను పదేళ్లలోనే వందేళ్లకు సరిపడేలా విధ్వంసం చేశారు. బావాబావమరుదులు తోడేళ్లలా తిరుగుతూ మళ్లీ అధికారం కావాలని కలలు కంటున్నారు. ప్రజలు మిమ్మల్ని కోరుకోవడం లేదు. తెలంగాణ సమాజం కేసీఆర్ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేసింది. భవిష్యత్తులో మీకు పదవులు లేవు, కేవలం గతం మాట్లాడుకోవడమే మిగిలింది. నల్లగొండ జిల్లా ప్రజలు బీఆర్ఎస్‌ను ఉప్పుపాతర వేశారు. తులసి వనంలో గంజాయి మొక్కలా సూర్యాపేటలో ఒకడు మిగిలాడు, అతడిని కూడా రాబోయే రోజుల్లో లేకుండా చేస్తాం" అని కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలపై సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.WhatsApp Image 2026-06-28 at 19.55.25

*అసెంబ్లీలో చర్చకు సిద్ధం.. ప్రతిపక్షాలకు సవాల్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్న వారికి అసెంబ్లీ వేదికగానే సమాధానం చెబుతామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రత్యేక అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఏర్పాటు చేసి పదేళ్ల బీఆర్ఎస్ పాలన, పన్నెండేళ్ల బీజేపీ పాలన, మా ముప్పై నెలల (రెండున్నరేళ్ల) పాలనపై, అలాగే మూడు పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనిపై ప్రతిపక్షాలు స్పీకర్, కౌన్సిల్ చైర్మన్‌కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు.

*పేదల సంక్షేమమే మా మార్గం.. సన్నబియ్యం పంపిణీ
గత ప్రభుత్వం పేదలకు దొడ్డు బియ్యం ఇస్తే, తమ ప్రభుత్వం రూ.16 వేల కోట్ల బడ్జెట్‌తో 3 కోట్ల 28 లక్షల మందికి ఆరు కిలోల చొప్పున నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని సీఎం తెలిపారు. "ఫామ్‌హౌస్‌లో ఉండే కేసీఆర్, జన్వాడలో ఉండే కేటీఆర్ ఏ సన్నబియ్యం తింటున్నారో.. పేదల పిల్లలు కూడా అదే తింటున్నారు. పేదవాడి ఆత్మగౌరవం కోసం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. కేసీఆర్ గజ్వేల్‌లో 1000 ఎకరాల్లో, ఆయన కొడుకు జన్వాడలో, బిడ్డ శంకర్ రెడ్డి పల్లిలో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు తప్ప పేదవాడి ఇళ్ల గురించి ఆలోచించలేదు" అని విమర్శించారు.

*వ్యవసాయం ఒక పండుగ.. రికార్డు స్థాయిలో ధాన్యాల కొనుగోలు
రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బోనస్ వంటి పథకాల ద్వారా రైతాంగం కోసం రూ.1,56,000 కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడి యూరియా తెప్పించామని, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీరు రాకపోయినా రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. "రూ. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కాస్తా 'కూలేశ్వరం' అయింది. నాడు 'కాళేశ్వర్ రావు' అని పిలిపించుకున్న హరీష్ రావు, అది కూలిపోతే అటు దిక్కు కూడా చూడలేదు" అని మండిపడ్డారు.

*విద్యా విప్లవం.. ఉద్యోగాల జాతర
ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, దీని ద్వారా వందలాది మంది అంబేద్కర్‌లను సృష్టించడమే తమ లక్ష్యమని సీఎం అన్నారు. వందేళ్లుగా పరిష్కారం కాని ఎస్సీ వర్గీకరణకు 30 నెలల్లోనే శాశ్వత పరిష్కారం చూపామని, 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామని గుర్తుచేశారు.

*మూసీ ప్రక్షాళనపై శపథం.. 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే!
"మూసీ నది కాలుష్యం వల్ల నల్లగొండ జిల్లా ఆడబిడ్డలకు అంగవైకల్యంతో పిల్లలు పుడుతున్నారు. ఈ పాపాల భైరవుల పాలన పోవాలనే మేము మూసీ ప్రక్షాళనకు నడుం బిగించాం. మూసీ శుద్ధిని ఎవరు అడ్డుకున్నా, వారిని మూసీలోనే వేసి తొక్కుతాం. వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ (SLBC) ప్రాజెక్టును పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు నీరిస్తాం. బిల్లా-రంగాలు ఊరూరా తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. 2024 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-06-28 at 19.56.18

About The Author