ప్రజాధనం స్వాహా: భైరమాలగూడలో నాసిరకం రోడ్డు నిర్మాణం!
- కాంట్రాక్టర్, అధికారుల కుమ్మక్కు.. ఫిర్యాదులు చేసినా మొద్దునిద్ర వీడని యంత్రాంగం!
- ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, ఎస్.ఇ అశోక్ రెడ్డి దృష్టి సారించాలి.
ఎల్బీనగర్:
ప్రజలు చెమటోడ్చి కట్టిన పన్నుల సొమ్ము కాంట్రాక్టర్లు, అవినీతి అధికారుల జేబుల్లోకి వెళ్తోంది. ఎల్బీనగర్ నియోజకవర్గం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ భైరమాలగూడలోని సీతారాం నగర్ నుండి ఎస్‌వీ కాలనీ వరకు చేపట్టిన సీ.సీ రహదారి నిర్మాణం ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి, కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా రోడ్డు పనులు కానిచ్చేస్తున్నారు. దీనిపై కాలనీ వాసులు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*నిబంధనలు గాల్లోకి.. అడ్డగోలుగా పనులు!
రోడ్డు నిర్మాణంలో కనీస సాంకేతిక ప్రమాణాలు పాటించడం లేదు. లెవల్స్ సక్రమంగా లేకపోవడం, ఎత్తుపల్లాలుగా రోడ్డు వేయడంతో రేపు వర్షం పడితే నీరు ఎటు పోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. సిమెంట్, కాంక్రీట్ మిశ్రమంలో తీవ్ర అవినీతి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పనులు నాసిరకంగా ఉన్నాయని స్థానికులు నెత్తీనోరూ బాదుకుంటున్నా.. కాంట్రాక్టర్ మాత్రం తన ఇష్టారాజ్యంగా పనులు ముగించేందుకు తహతహలాడుతున్నాడు.
అవినీతి కాంట్రాక్టర్ అడ్డగోలుగా పనులు చేస్తుంటే అడ్డుకోవాల్సిన అధికారులు, అతనికి వత్తాసు పలకడం వెనుక అసలు రహస్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోడ్డు నాణ్యతపై కాలనీ వాసులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ.. ఉన్నతాధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్లు చేతులు మారాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల అభ్యంతరాలను, హక్కులను కాలరాస్తూ.. ప్రభుత్వ నిధులను యథేచ్ఛగా వృథా చేస్తున్నారు.
*ఇకనైనా చర్యలు తీసుకుంటారా?
ప్రజాధనంతో అక్రమాలకు పాల్పడుతున్న కాంట్రాక్టర్‌పై, అతనికి అండగా నిలుస్తున్న అవినీతి అధికారులపై వెంటనే విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఈ రోడ్డు పనులను సాంకేతికంగా తనిఖీ చేయాలని, నాసిరకం పనులకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు. లేనిపక్షంలో ప్రజాపోరాటం తప్పదని స్పష్టం చేస్తున్నారు.
