తెలంగాణ-ఫ్రాన్స్ సరికొత్త పర్యాటక సమరస్యం!

సాంస్కృతిక బంధాల బలోపేతానికి జూపల్లి సరికొత్త వ్యూహం... భాగస్వామ్యానికి ఫ్రాన్స్ సమ్మతి!

తెలంగాణ-ఫ్రాన్స్ సరికొత్త పర్యాటక సమరస్యం!

హైదరాబాద్:

తెలంగాణ అద్భుత పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు, ముఖ్యంగా ఫ్రెంచ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల ద్వారానే పర్యాటకం, పెట్టుబడులు ఊపందుకుంటాయని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఫ్రాన్స్ రాయబార కార్యాలయ ప్రధాన అధికారి (కాన్సుల్ జనరల్) మార్క్ లామీ, ఉప ప్రధాన అధికారి పాస్కల్ లోరియో మంత్రి జూపల్లి కృష్ణారావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉభయ ప్రాంతాల మధ్య పర్యాటకం, సంస్కృతి, చారిత్రక సంపద పరిరక్షణ, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై విస్తృతంగా చర్చించారు.

*సంయుక్త బృందం ఏర్పాటుకు ప్రతిపాదన!
తెలంగాణకు ఉన్న గొప్ప చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి వివరించారు. హైదరాబాద్ మహానగరం ప్రపంచస్థాయి నగరంగా వేగంగా ఎదుగుతూనే, తన సాంస్కృతిక అస్తిత్వాన్ని కాపాడుకుంటోందని చెప్పారు. తెలంగాణ పర్యాటక ప్రాధాన్యతలను ఫ్రాన్స్‌లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం, అక్కడి పర్యాటక సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
రెండు ప్రాంతాల మధ్య ఉన్న సాంస్కృతిక సారూప్యతలు, చారిత్రక కట్టడాల పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి అవకాశాలను అధ్యయనం చేసేందుకు ఒక 'సంయుక్త బృందాన్ని' (జాయింట్ టీమ్) ఏర్పాటు చేయాలని మంత్రి ప్రతిపాదించారు. ఇది దీర్ఘకాలిక భాగస్వామ్యానికి బలమైన పునాది వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

*పర్యాటక రంగమే ఆర్థిక రథచక్రం: ఫ్రాన్స్ ప్రతినిధి బృందం
ప్రపంచంలోనే అత్యధికంగా పర్యాటకులు సందర్శించే దేశాల్లో ఫ్రాన్స్ అగ్రస్థానంలో ఉందని, ఏటా 10 కోట్లకు పైగా అంతర్జాతీయ పర్యాటకులు తమ దేశాన్ని సందర్శిస్తున్నారని ఫ్రాన్స్ రాయబార కార్యాలయ ప్రధాన అధికారి మార్క్ లామీ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదం మాత్రమే కాదని, దేశ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు, విదేశీ పెట్టుబడులకు అద్భుతమైన చోదక శక్తి అని పేర్కొన్నారు.

 "భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య రక్షణ, ఔషధ తయారీ (ఫార్మా), సాంకేతిక రంగాలలో ఇప్పటికే బలమైన భాగస్వామ్యం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 200 మంది ఫ్రెంచ్ పౌరులు నివసిస్తున్నారు. తెలంగాణతో పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ పరిరక్షణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఫ్రాన్స్ సంపూర్ణ సిద్ధంగా ఉంది."
"మార్క్ లామీ, ఫ్రాన్స్ రాయబార కార్యాలయ ప్రధాన అధికారి"

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని విశిష్ట పర్యాటక ప్రాంతాలను ఫ్రెంచ్ పర్యాటకులకు మరింత చేరువ చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని ఫ్రాన్స్ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా హామీ ఇచ్చింది. ఈ సంయుక్త కార్యాచరణ రాబోయే రోజుల్లో తెలంగాణ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపుతో పాటు సరికొత్త పెట్టుబడులను తీసుకువస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.WhatsApp Image 2026-06-29 at 16.20.37

About The Author