తాండూరులో డబుల్ బెడ్‌రూం ఇళ్ల డ్రా వివాదం
- ప్రైవేట్ ట్రస్ట్ నిర్వహించిన డ్రా రద్దు చేయాలి: బీజేపీ నేతల డిమాండ్
- అర్హులైన పేదలకు అన్యాయం జరిగిందని ఆగ్రహం
- కుట్రలో ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
- బీజేపీ నేతల డిమాండ్
తాండూరు:
తాండూరు పట్టణంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల పేరుతో ప్రైవేట్ ట్రస్ట్ నిర్వహించిన డ్రా పై వివాదం చెలరేగింది. ఈ డ్రాను తక్షణమే రద్దు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
సోమవారం తాండూరులోని బీజేపీ నాయకుడు యు. రమేష్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు. తాండూరుకు చెందిన ఏస్ జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో, పేదలకు ప్రభుత్వం కేటాయించాల్సిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను "ఇందిరమ్మ ఇళ్లు" పేరుతో డ్రా నిర్వహించి, కొంతమందికి కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు.
ఈ ప్రక్రియలో అధికార యంత్రాంగం ఎవరూ పాల్గొనలేదని, పూర్తిగా అనధికారికంగా ఈ డ్రా నిర్వహించారని వారు ఆరోపించారు. ముఖ్యంగా ఒకే వర్గానికి చెందిన సుమారు 200 మందికి ఇళ్లు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ డ్రాలో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, అలాగే ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రోత్సహించారని ఆరోపించారు. ట్రస్ట్‌కు చెందిన వ్యక్తులు, కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరేలా డ్రా నిర్వహించారని విమర్శించారు.
దీంతో నిజమైన అర్హులైన పేదలకు ఇళ్లు దక్కే పరిస్థితి లేకుండా పోయిందని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనధికారిక డ్రాను వెంటనే రద్దు చేయాలని, ఇందులో భాగమైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇక ఈ కార్యక్రమంపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ముందుగానే సమాచారం ఉందా అనే అనుమానం వ్యక్తం చేశారు. ట్రస్ట్ తరఫున ఇన్విటేషన్
కార్డులు కూడా ప్రజాప్రతినిధులకు అందించడాన్ని వారు ప్రస్తావించారు.
ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అన్ని వర్గాలకు చెందిన నిజమైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపులు జరగాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మీడియా సమావేశంలో బాలేశ్వర్ గుప్తా, కృష్ణా ముదిరాజ్, భద్రేశ్వర్, అంతారం లలిత, సాహో శ్రీలత, రజిని, పటేల్ విజయ్, దోమ కృష్ణ, శాంతు కుమార్, రమేష్, కౌన్సిలర్లు నాగారం మల్లేశం, శ్రీకాంత్ రెడ్డి, అంతారం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
