దివ్యాంగుల జీవితాల్లో సరికొత్త వెలుగులు!

  • ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ
  • 745 మందికి పునర్జన్మ.. అండగా నిలిచిన నారాయణ్ సేవా సంస్థాన్

దివ్యాంగుల జీవితాల్లో సరికొత్త వెలుగులు!

హైదరాబాద్:

నిన్నటి వరకు కదలలేని అడుగులకు స్థిరత్వం లభించింది.. అచేతనంగా ఉన్న చేతులకు ప్రాణం వచ్చింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆదివారం ఒక అపురూప మానవతా యజ్ఞానికి వేదికైంది. నారాయణ్ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కృత్రిమ అవయవాల అమరిక శిబిరం వందలాది మంది దివ్యాంగుల జీవితాల్లో కొత్త ఆశలు నింపింది. మేక్ ఎ ఛేంజ్ ఫౌండేషన్ (యూకే), విలెస్‌డెన్ శ్రీ స్వామినారాయణ ఆలయం సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 745 మంది లబ్ధిదారులకు 815 కృత్రిమ అవయవాలు, కాలిపర్లను అందజేశారు.

మానవతా విజయానికి ప్రతీక: గవర్నర్:
శిబిరాన్ని ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ కార్యక్రమాన్ని ‘మానవతకు నిలువెత్తు నిదర్శనం’గా అభివర్ణించారు. శిబిరంలో లబ్ధిదారులతో నేరుగా ముచ్చటించిన ఆయన, కృత్రిమ అవయవాల సాయంతో వారు చేసిన పరేడ్‌ను ఆసక్తిగా తిలకించి వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కరుణ, సామూహిక కృషి తోడైతే అద్భుతాలు సాధించవచ్చని ఈ శిబిరం నిరూపించింది. సంస్థ అధ్యక్షుడు ప్రశాంత్ అగర్వాల్ చేస్తున్న కృషి అభినందనీయం" అని పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ.. ఇది కేవలం సేవా కార్యక్రమం మాత్రమే కాదని, దివ్యాంగుల జీవితాలను సమూలంగా మార్చే మహత్తర యజ్ఞమని కొనియాడారు. దివ్యాంగులను సమాజ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తన నియోజకవర్గంలోనూ త్వరలోనే ఇలాంటి శిబిరాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
అత్యాధునిక జర్మన్ సాంకేతికతతో..
శిబిరానికి సంబంధించిన వివరాలను ట్రస్టీ దేవేంద్ర చౌబిసా వెల్లడిస్తూ.. ముందస్తుగా వెయ్యి మందికి పైగా నమోదు చేసుకోగా, అర్హులైన 745 మందికి అత్యాధునిక జర్మన్ సాంకేతికతతో రూపొందించిన ‘నారాయణ్ మాడ్యులర్’ అవయవాలను అమర్చినట్లు తెలిపారు. వీటి వినియోగంపై లబ్ధిదారులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చామన్నారు. ఎమ్మెల్సీ బొగ్గుర దయానంద్ పాల్గొని సంస్థ సేవలను ప్రశంసించారు.

సేవా పథంలో నారాయణ్ సేవా సంస్థాన్: స్థాపన: 1985 (కైలాస్ మానవ్ ద్వారా)
 అవయవాల పంపిణీ: 39,000 మందికి పైగా..
 వైద్య సేవలు: 4.5 లక్షల మందికి పైగా లబ్ధి.
శిబిరం ముగింపులో సేవలో భాగస్వాములైన దాతలను ఘనంగా సన్మానించారు. కృత్రిమ అవయవాల సాయంతో సొంతంగా నీళ్లు తాగుతూ, నడక సాగిస్తున్న వారిని చూసి అక్కడికి వచ్చిన వారంతా భావోద్వేగానికి లోనయ్యారు.WhatsApp Image 2026-05-03 at 16.37.38

About The Author