తాగినోడు స్టీరింగ్ పడితే పదేళ్ల జైలు!

  • మల్కాజిగిరిలో మందుబాబుల గుండెల్లో రైళ్లు.. వారం రోజుల్లో 318 మంది చిత్తు
  • బీఎన్ఎస్ సెక్షన్ 105 గుబులు: ప్రాణం తీస్తే 'హత్య' కిందకే!

తాగినోడు స్టీరింగ్ పడితే పదేళ్ల జైలు!

మల్కాజిగిరి:

మందు కొట్టి బండి తీస్తే.. ఇకపై అది కేవలం 'కేసు' కాదు, జీవితాంతం వెంటాడే 'శాపం' కానుంది. మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు మందుబాబుల తాట తీస్తున్నారు. పోయిన వారం (ఏప్రిల్ 26 నుంచి మే 02 వరకు) సాగించిన మెరుపు తనిఖీల్లో ఏకంగా 318 మంది మత్తులో చిక్కారు. వీళ్లందరికీ కోర్టు మెట్లు ఎక్కించి, చట్టం రుచి చూపించేందుకు ఖాకీలు సిద్ధమయ్యారు.

మత్తులో చిత్తవుతున్న 'ద్విచక్ర' వాహనదారులు!
పట్టుబడిన వారిలో ఎక్కువ శాతం యువత, మధ్యతరగతి వాళ్లే ఉండటం గమనార్హం. పోలీసులు తేల్చిన లెక్కలు చూస్తుంటే గుండె గుభేల్ మంటున్నది:
 టూ వీలర్లు: 271 (గల్లీ గల్లీలో గాలికి తిరిగే బ్యాచ్)
 కార్లు: 37 (హైవేలపై హల్చల్ చేస్తున్న పెద్ద మనుషులు)
 ఆటోలు: 10 (ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కిరాయి బండ్లు)
వీరిలో ఐదుగురైతే అసలు మనిషి రూపంలో ఉన్న మత్తు యంత్రాల్లా దొరికారు. వారి శరీరంలో మద్యం మోతాదు (BAC) 300 mg దాటేసింది. అంటే, వాళ్లకు రోడ్డు పక్కన ఉన్న డివైడర్లు కూడా

WhatsApp Image 2026-05-03 at 16.51.18

 కనిపించని పరిస్థితి.

కొత్త చట్టం.. కోరలు చాచిన శిక్ష!
ట్రాఫిక్ డీసీపీ కె. రాహుల్ రెడ్డి (IPS) వాహనదారులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. "ఇకపై ఆటలు సాగవు. భారతీయ న్యాయ సంహిత (BNS)-2023లోని సెక్షన్ 105, అమల్లోకి వచ్చింది. తాగి బండి నడిపి ఎవరి ప్రాణానికైనా ముప్పు తెస్తే, దాన్ని సాధారణ ప్రమాదంగా చూడబోం. 'హత్య కాని నేరపూరిత నరహత్య'గా పరిగణిస్తాం" అని స్పష్టం చేశారు.

ఏముంది ఈ సెక్షన్‌లో?: ఈ చట్టం కింద బుక్కైతే బెయిల్ రావడం కష్టం. దోషిగా తేలితే ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష' పడుతుంది. జీవితం జైలు పాలు కావాల్సిందే!

తీర్పులతో దిమ్మతిరిగింది!
పోయిన వారం 282 కేసుల విచారణ పూర్తి కాగా, కోర్టులు కఠినమైన తీర్పులు ఇచ్చాయి:
 జైలు పాలు: 17 మందికి కటకటాల వెనక్కి పంపారు.
 సోషల్ సర్వీస్: 18 మందికి రోడ్లపై ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని, సామాజిక సేవ చేయాలని ఆర్డర్లు వేశారు.

 భారీ జరిమానా: మిగతా 247 మందికి జేబులు గుల్లయ్యేలా ఫైన్లు వడ్డించారు.

ఆఫీసర్ మాట.. హెచ్చరిక బాట!
"రోడ్డు మీదకి వచ్చేటప్పుడు పెళ్లాం పిల్లల ముఖాలు చూసుకోండి. మత్తులో ఊగుతూ ఎదుటివారి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే రాయితీలు ఉండవు.. దాపరికం అస్సలే ఉండదు."
కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ (డీసీపీ - ట్రాఫిక్-I)*WhatsApp Image 2026-05-03 at 16.51.19 (1)

About The Author