అక్బర్‌పేట్ భూంపల్లి చౌరస్తాలో రైతుల ఆందోళన
- గ్రేడ్‌ల విధానం రద్దు చేయాలి
- మిలర్లతో ఐకేపీ అధికారులు, సిబ్బంది కుమ్మకై యారని ఆరోపణ
- సోమవారం సాయంత్రం సమస్య పరిష్కరించాలి
- లేకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిక
సిద్దిపేట:
వరి కొనుగోలు కేంద్రాల్లో అమలు చేస్తున్న గ్రేడ్‌ల విధానంపై బొప్పాపూర్ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లి మండల చౌరస్తాలో రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాతో సిద్దిపేట, రామాయంపేట జాతీయ రహదారి 765 డిజి హైవే సుమారు రెండుగంటల పాటు నిలిచిపోగా వాహనదారులకు అంతరాయం కలిగింది.ఈ విషయం తెలుసుకున్న అక్బర్ పేట భూంపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జోక్యం చేసుకుని ధర్నా విరమించారు.ఈ సందర్భంగా బొప్పాపూర్ సర్పంచ్ మాధవనేని భాను ప్రసాద్ రావు, రైతులు మాట్లాడుతూ అప్పులు చేసి, ఎండా వానలను లెక్కచేయకుండా పంట పండిస్తున్నామని, కానీ ధాన్యం అమ్ముకునే సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం, మిల్లర్ల నిర్లక్ష్యం, గ్రేడ్‌ల పేరుతో కోతలు విధించడం రైతులను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని వారు ఆరోపించారు. ట్రాక్టర్లు, లారీలు రోజుల తరబడి నిలిపివేయడం వల్ల రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని, రాత్రింబవళ్లు ధాన్యం వద్ద కాపలా కాయాల్సి వస్తోందన్నారు. తాగునీరు, టెంట్లు, హమాలీల సౌకర్యాలు లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోందని పేర్కొన్నారు.తేమ, రంగు, గ్రేడ్ పేర్లతో ధాన్యాన్ని తిరస్కరించడం వల్ల రైతులు నష్టపోతుండగా, అదే ధాన్యాన్ని తర్వాత మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) రైతులకు పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఐకేపీ కేంద్రాల్లో టోకెన్లు ఇచ్చిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు రోజులు తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.“దేశానికి అన్నం పెట్టే రైతునే అవమానించడం బాధాకరం” అని పేర్కొంటూ, వెంటనే సమస్యలు పరిష్కరించి, గ్రేడ్‌ల విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే మంగళవారం భారీ సంఖ్యలో రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అరిగే కృష్ణ, బాపు రెడ్డి,శ్రీరామ్, తదితరులు ఉన్నారు.
