గవర్నర్లు, మంత్రుల పేర్లతో ఐపీఎల్ టికెట్ల దందా!
- ఉప్పల్ పోలీసుల చేతికి చిక్కిన ఫోర్జరీ ముఠా.. నిందితుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి
- పక్కా ప్లాన్‌తో వీవీఐపీ కోటాకు కన్నం.. లెటర్ హెడ్లు మార్చి మాయాజాలం
హైదరాబాద్:
ఐపీఎల్ క్రికెట్ క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుని, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రముఖుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ టికెట్ల దందాకు తెరలేపిన ముఠా గుట్టును ఉప్పల్ పోలీసులు రట్టు చేశారు. సామాన్య ప్రజలను మోసం చేయడమే కాకుండా, ఏకంగా గవర్నర్లు, న్యాయమూర్తులు, మంత్రుల పేర్లను వాడుకుంటూ క్రికెట్ అసోసియేషన్లనే బురిడీ కొట్టించిన ముగ్గురు సభ్యుల ముఠాను సోమవారం అరెస్ట్ చేశారు.
గూగుల్ నుంచి లెటర్ హెడ్లు.. నిమిషాల్లో ఫోర్జరీ!
నిందితులు అనుసరించిన తీరు అధికారులను విస్తుగొలుపుతోంది. గూగుల్ ద్వారా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల అధికారిక లెటర్ హెడ్లను నిందితులు డౌన్‌లోడ్ చేసుకునేవారు. వాటిపై ప్రముఖుల సంతకాలను అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ చేసి.. హైదరాబాద్ (HCA), తమిళనాడు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లకు వినతి పత్రాలు పంపేవారు. "మాకు కేటాయించిన వీవీఐపీ కోటాలో కాంప్లిమెంటరీ టికెట్లు జారీ చేయండి" అంటూ ఈ లేఖల ద్వారా అధికారులను నమ్మించేవారు. అలా ఉచితంగా పొందిన ఖరీదైన టికెట్లను బ్లాక్ మార్కెట్లో సామాన్య అభిమానులకు భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది.
మే 3వ తేదీన ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వద్ద ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించిన ఏపీ రిజిస్ట్రేషన్ (AP-40BB-6768) కలిగిన మహీంద్రా థార్ వాహనాన్ని ఎస్.ఐ. మాధవరెడ్డి బృందం తనిఖీ చేయగా అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వారి వద్ద లభించిన నకిలీ పత్రాలు, ఫోర్జరీ చేసిన లేటర్ హెడ్లను చూసి పోలీసులు అవాక్కయ్యారు.
ముగ్గురి అరెస్ట్.. మరో ముగ్గురు పరారీ
ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పల్కూరుకు చెందిన గట్టమనేని అశోక్ (రియల్ ఎస్టేట్ వ్యాపారి), కంకనాల దినేష్, సింగమనేని వేణుమాధవ్, అనే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో సంబంధం ఉన్న చెన్నైకి చెందిన ఆశిష్, సెంథిల్, తాన్సిల్ అనే వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
*స్వాధీనం చేసుకున్న వస్తువులు:*
* *రూ. 1,10,000* విలువైన ఐపీఎల్ టికెట్లు.
* నేరానికి ఉపయోగించిన *మహీంద్రా థార్* వాహనం.
* *5* మొబైల్ ఫోన్లు, *5* ఫోర్జరీ చేసిన అధికారిక లెటర్ హెడ్‌లు.
మల్కాజిగిరి డీసీపీ సురేష్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్ ముఠా ఆగడాలకు చెక్ పెట్టింది. నిందితులను సోమవారం న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. క్రికెట్ అభిమానులు అనధికారిక వ్యక్తుల వద్ద టికెట్లు కొని మోసపోవద్దని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
