సమయస్ఫూర్తి…నిమిషాల వ్యవధిలోనే విద్యార్థిణి గమ్యానికి చేర్చిన పోలీసులు

సమయస్ఫూర్తి…నిమిషాల వ్యవధిలోనే విద్యార్థిణి గమ్యానికి చేర్చిన పోలీసులు

ఎల్బీనగర్:

పరీక్షల సమయంలో ఒక్క నిమిషం కూడా ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. అలాంటి కీలక సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి ఒక విద్యార్థిని భవిష్యత్తును కాపాడిన ఘటన నాగోల్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పోలీసులు చూపిన చాకచక్యం, సమన్వయం ప్రత్యేకంగా నిలిచింది.కర్మన్‌ఘాట్ బైరామలగూడలోని అడ్వాన్స్ బ్లాక్ బోర్డుఅకాడమీ కోచింగ్ సెంటర్‌లో నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న ఎస్. నందిని, కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన వాహనంలో వెళ్లాల్సింది పోయి పొరపాటున ఎల్‌బీనగర్ రూట్ వాహనంలో ఎక్కి నాగోల్‌లోని జడ్పిహెచ్ఎస్ పరీక్ష కేంద్రం వద్ద దిగింది. అయితే కొద్ది సేపటికే అది తాను రాయాల్సిన అసలు కేంద్రం కాదని గుర్తించి తీవ్ర ఆందోళనకు గురైంది.
ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న నాగోల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆమె పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. విద్యార్థినికి ధైర్యం చెప్పడంతో పాటు, వనస్థలిపురం ఇన్స్పెక్టర్‌తో సమన్వయం చేసి అసలు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా అత్యవసర ఏర్పాట్లు చేశారు. పోలీస్ వాహనాన్ని వినియోగిస్తూ వేగంగా తరలించి, మధ్యాహ్నం 1:15 గంటలలోపు వనస్థలిపురం రైతు బజార్ సమీపంలోని జడ్పిహెచ్ఎస్ హై స్కూల్ కాంప్లెక్స్‌లో ఉన్న అసలు పరీక్ష కేంద్రానికి సురక్షితంగా చేర్చారు.
పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోలేనేమో అన్న భయంతో ఉన్న నందినికి ఇది పెద్ద ఊరటనిచ్చింది. సంవత్సరం పాటు చేసిన కృషి వృథా కాకుండా పోలీసుల తక్షణ చర్యల వల్ల ఆమె పరీక్ష రాయగలిగింది.ఈ ఘటనపై స్పందించిన కాలేజీ చైర్మన్ మూర్తి, ప్రిన్సిపాల్ రమ, విద్యార్థినీ తండ్రి నీలియా నాయక్ నాగోల్ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.స్థానికులు కూడా పోలీసుల సమయస్ఫూర్తి, బాధ్యతాయుత వైఖరిని ప్రశంసిస్తూ, ప్రజలతో పోలీసుల అనుబంధం ఇలాంటివి మరింత బలపరుస్తాయని అభిప్రాయపడుతున్నారు.

About The Author