లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి
ఇంటి అనుమతి కోసం రూ. 5 లక్షల డిమాండ్.. లక్ష తీసుకుంటుండగా అరెస్ట్
హైదరాబాద్:
ఇంటి నిర్మాణ అనుమతి ఇప్పించేందుకు లంచం డిమాండ్ చేసిన జీహెచ్‌ఎంసీ జూనియర్ అసిస్టెంట్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని బోరబండ సర్కిల్-37 కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న బి. శ్రీలతను సోమవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
ఒక బాధితుడు తన ఇంటి నిర్మాణ అనుమతి (House Construction Permission) కోసం మీ-సేవా ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి, అనుమతి పత్రాలు ఇప్పించేందుకు శ్రీలత సదరు బాధితుడిని రూ. 5 లక్షల లంచం డిమాండ్ చేసింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్ద ఉన్న రత్నదీప్ సమీపంలో మొదటి విడతగా రూ. లక్ష నగదును శ్రీలత తీసుకుంటుండగా ఏసీబీ సిటీ రేంజ్-I అధికారులు ఆమెపై దాడి చేశారు. ఆమె నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జరిపిన కెమికల్ టెస్టులో శ్రీలత చేతులు పాజిటివ్‌గా తేలడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
రిమాండ్‌కు తరలింపు
అధికారిక విధులను దుర్వినియోగం చేస్తూ, అక్రమ మార్గంలో లబ్ధి పొందేందుకు ప్రయత్నించిన శ్రీలతను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సింధు శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ *1064*కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు..jpeg)
