నిబంధనలు ‘గాలి’కి.. అక్రమ నిర్మాణాలు ‘జోరు’గా!
- చింతలకుంట విశాల్ మార్ట్ భవనంపై అదనపు అంతస్తుల దందా*
- అగ్నిప్రమాదం జరిగితే బాధ్యులెవరు?
- ఫిర్యాదులు చేసినా పట్టించుకోని నాగోల్ సర్కిల్ అధికారులు
- ఖజానాకు గండి.. అవినీతి ఆరోపణల వెల్లువ!*
నాగోల్:
అధికారుల అండదండలు ఉన్నాయో లేక నిబంధనలంటే లెక్కలేదో కానీ, నాగోల్ డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విజయవాడ హైవే పక్కన, చింతలకుంట పల్లవి గార్డెన్ సమీపంలోని హకీమాబాద్ కాలనీ ప్లాట్ నంబర్ 1 లో ఉన్న భారీ కమర్షియల్ కాంప్లెక్స్ విశాల్ మార్ట్ భవనం ఇప్పుడు అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మున్సిపల్ చట్టాలను తుంగలో తొక్కి, అగ్నిమాపక నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ దందాపై స్థానికులు మండిపడుతున్నారు.
అనుమతులు లేవు.. ఆందోళనే లేదు!
సదరు కమర్షియల్ కాంప్లెక్స్ పైన ఎటువంటి అనుమతులు లేకుండానే అదనపు అంతస్తుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. నిబంధనల ప్రకారం కమర్షియల్ భవనాలకు ఉండాల్సిన 'ఫైర్ సేఫ్టీ' ప్రమాణాలను ఇక్కడ పూర్తిగా విస్మరించారు. రేపు పొరపాటున అగ్ని ప్రమాదం జరిగితే ఆస్తి, ప్రాణ నష్టానికి బాధ్యత వహించేది ఎవరని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అధికారుల కళ్లముందే ఇంత భారీ నిర్మాణం సాగుతున్నా, వారు కళ్లు మూసుకోవడం వెనుక ఉన్న మర్మమేమిటని కాలనీవాసులు నిలదీస్తున్నారు.
ఫిర్యాదులు బుట్టదాఖలు!
ఈ అక్రమ నిర్మాణంపై నాగోల్ సర్కిల్ అధికారులకు రాతపూర్వక ఫిర్యాదులు అందినప్పటికీ ఫలితం శూన్యం.
టి.పి.ఎస్ సోమేశ్ కుమార్
ఏసిపి మధు
డిప్యూటీ కమిషనర్
వీరికి పలుమార్లు విన్నవించినా, క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఫిర్యాదు చేసినా స్పందించని పరిస్థితి చూస్తుంటే, క్షేత్రస్థాయి అధికారుల పరోక్ష సహకారంతోనే ఈ అక్రమ సామ్రాజ్యం విస్తరిస్తోందన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.
ఒకవైపు అక్రమ నిర్మాణాలు వెలుస్తుంటే, మరోవైపు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అనుమతి ఫీజులు, పెనాల్టీలు ఎగ్గొట్టి అక్రమార్కులు జేబులు నింపుకుంటుంటే, అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టడమేనని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ఉన్నతాధికారులు స్పందించాలి..
ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ మరియు మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఈ వ్యవహారంపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి, నిబంధనలను అతిక్రమించిన వారితో పాటు, వారికి సహకరిస్తున్న అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ఉన్నతస్థాయిలో పోరాటానికి సిద్ధమని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు..jpeg)
